ArticlesNews

సనాతన సంస్కరణవాది శ్రీ కావ్యకంఠ గణపతి ముని

235views

( జూలై 25 – శ్రీ కావ్యకంఠ గణపతి ముని వర్ధంతి )

మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి సనాత ధర్మాన్ని సంరక్షించడానికి యుగపురుషులు అవతరిస్తారు. వారి రాకతో పండితులే కాదు పామరులు, సమస్త జీవకోటి తరిస్తారు. అటువంటివారిలో చెప్పుకోదగినవారు వశిష్ఠ గణపతి ముని. ఈయన్ను కావ్యకంఠ గణపతి ముని అని కూడా అంటారు. ఈయన పండితుడు, జ్యోతిష్యుడు, అధ్యాత్మికవేత్త, తపోవేత్త మాత్రమే కాదు కవి, దేశభక్తుడు, సంస్కరణ శీలి కూడా…! గణపతి ముని 1878 నవంబరు 17న ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి సమీపంలోని కలవరాయిలో శ్రీ నరసింహ శాస్త్రి, నరసమాంబ అనే పుణ్యదంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సూర్య గణపతి శాస్త్రి. పదేళ్లు వచ్చే సరికే గణిత శాస్త్రంలో, పంచాంగ గణనంలో విద్వత్తు సంపాదించాడు. అవధానాలలో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ వయసులోనే ఒక్క గంటలో ముప్పై నాలుగు శ్లోకాలతో “పాండవ ధార్తరాష్ట్ర సంభవ” అన్న ఖండిక రాశారు.

గణపతి ముని లౌకిక, అలౌకికమైన అనేక విషయాలపై లోకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు. తన జీవితాన్ని తపస్సుకి, సమాజోద్దరణకి వెచ్చించి, జాతి ఉద్దరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేశారు. ఆయన రచనలు నేటి సమాజ పరిస్థితులకు ఎంతో అవసరమైనప్పటికీ అవి చాలా మందికి తెలియకపోవటానికి ఒక ప్రధాన కారణం వారు సంస్కృతంలో వ్రాయటమే. దురదృష్టవశాత్తూ ఇప్పటివరకు వాటిని అనువదించే పని జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వాలు సంస్కృత పాండిత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని చిన్నచూపు చూడడం కూడా మరొక కారణం. రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాలలో గణపతి ముని అనుభవపూర్వక జ్ఞానం ఆయన రచనల్లో కనిపిస్తుంది. నిరంతర జపధ్యాన సమాధుల వల్ల అనేక దేవతల అనుగ్రహానికి పాత్రులైన గణపతి ముని, దేవతా తత్వాన్ని, విద్యలను అందరికి తెలియజెప్పేందుకు స్తోత్ర, సూత్ర రూపంలో ఉంచారు. వీటిలో వారి భక్తి, జ్ఞానాలతో పాటు దేశం పట్ల వారి ప్రేమ, లోకోద్దరణ కాంక్ష కనిపిస్తాయి.

సమాజాన్ని ధర్మదృష్టితో చూసి దానిలో రావలసిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావులలో ఒకరు గణపతి ముని. మంత్ర, ధ్యానాలలో స్త్రీ, పురుష, వర్గ భేదాలు అసంబద్ధమనీ, సామాజిక, ఆర్థిక రంగాలలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో సైతం మహిళలకు సమాన హక్కులు ఉండడమే వేద సంప్రదాయమని గణపతి శాస్త్రి చెప్పేవారు. హరిజనులకు మంత్ర దీక్షలు ఇచ్చారు. వనవాసీలను సైతం తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణిలోకి ఐక్యం చేయడానికి, వారి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయడమే కాక అందుకు స్వయంగా ప్రయత్నించారు. పంచజన చర్చ, పంచమ మీమాంస వంటి రచనలలో వారి దృక్పథం తెలుస్తుంది. పరదేశీయుల పాలనలో ఉన్న దేశ విముక్తి కోసం ఆయన ఎంతగానో తపించారు. ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి తదితర స్తోత్ర గ్రంథాలలో సైతం జాతీయ భావాలను చొప్పించిన విలక్షణ దేశభక్తుడాయన. హైదరాబాదులోని ఆది హిందూ సంఘం ప్రతినిధులు గణపతి మునిని మాడపాటి హనుమంతరావు ఇంటి నుంచి పల్లకిలో ఊరేగిస్తూ వారి హాస్టల్‌కు తీసుకువెళ్లి ముని అనే బిరుదుతో సత్కరించారు.

అది 1935 వినాయక చవితి. ఆ రోజున అనూహ్యమైన అపశ్రుతి చోటు చేసుకుంది. గణపతి విగ్రహానికి కాకుండా గణపతిశాస్త్రికి పూజ చేస్తామని, దానికి అంగీకరించాలని భక్తులు గణపతి మునిని వేడుకున్నారు. అయిష్టంగానే ఆయన దానికి అంగీకరించారు. పూజ చక్కగా జరిగింది. కానీ అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రం కూడా చెప్పేశాడు. అది గమనించి ఆయన నవ్వుకున్నారట. 1936 జూలై 25న శిష్యులు ఎప్పటిలాగే శనివార హోమానికి వచ్చారు. గణపతి ముని కూడా హోమంలో పాల్గొన్నారు. తరువాత శిష్యులను పంపేసి, మంచం మీద పడుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అనాయాసంగా శరీరాన్ని వదిలి, అనామయ లోకానికి వెళ్లిపోయారు. అపారమైన పాండిత్యం, దేశ విముక్తి కోసం ఆరాటం, సంఘసంస్కరణాభిలాష, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తపన…ఇవన్నీ కలగలిసిన విశిష్టమైన వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని. సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూసిన ఆయన మనకు నిత్యస్మరణీయులు