ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం

193views

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం ఇక్కడ చదవండి

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం ఇక్కడ చదవండి

ఆరోపణలు.. ఆక్రోశాలు..!
కేంద్ర ప్రభుత్వం కీళడి తవ్వకాల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, తవ్వకాలను ఆపడానికి ప్రయత్నిస్తోందని డీఎంకే ప్రభుత్వం,ఆ పార్టీ నేతలు, తమిళ విద్యావేత్తలు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ‘‘హిందూత్వ ఎజెండా’’ ఉందని విమర్శించారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు ద్రావిడ దేశంలో అంటే, ‘‘దక్షిణ భారతదేశంలో సెక్యులర్‌ సంస్కృతికి తిరుగులేని రుజువు’’గా నిలిచాయని చెప్పుకొచ్చారు. అక్కడ ఏ విధమైన హిందు చిహ్నాలు, హిందు దేవతల విగ్రహాలు దొరకలేదని నమ్మబలికారు.

ఏఎస్‌ఐ సాధారణంగా ఒక ప్రధాన పురావస్తు ప్రదేశంలో తవ్వకాలను ఐదు సీజన్లలో (వానలు కూరవని పొడి వాతావరణంలో) చేపడుతుంది. ఏఎస్‌ఐ 2016-17లో కీళడిలో రెండవ సీజన్‌ ముగిసిన తర్వాత, ఎస్‌ఏ కె. అమర్‌నాథ్‌ రామకృష్ణను నియమ, నిబంధనలకు లోబడి గౌహతి సర్కిల్‌కు బదిలీ చేసింది. ఇది తమిళనాడులో వివాదానికి దారితీసింది. ఏఎస్‌ఐ తవ్వకాలను నిలిపివేయడానికి అమర్‌నాథ్‌ రామకృష్ణను బదిలీ చేసిందని డీఎంకే సర్కారు, ఆ పార్టీ నేతలు విమర్శలకు దిగారు. తవ్వకాలకు కావాలనే నిధులని కూడా నిలిపివేసిందంటూ అటు ఏఎస్‌ఐపైన, ఇటు కేంద్ర ప్రభుత్వంపైన అభాండాలు వేయడం మొదలుపెట్టారు. అమర్‌నాథ్‌ తన బదిలీ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఒక నిర్దిష్ట సర్కిల్‌లో ఎస్‌ఏ గరిష్ట పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుందని ఏఎస్‌ఐ తెలిపింది. ఆ నిబంధనకు లోబడే ఆయన్ను బదిలీ చేసినట్టు పేర్కొంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా మరో 26 మంది అధికారులను బదిలీ చేసినట్టు తెలిపింది. అమర్‌నాథ్‌ రామకృష్ణ బెంగళూరు సర్కిల్‌ పరిధిలో మూడు సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆయన ఆ కాలంలోనే కీళడిలో తవ్వకాలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐ అమర్‌నాథ్‌ స్థానంలో జోధ్‌పూర్‌ సర్కిల్‌లో డిప్యూటీ ఎస్‌ఏగా పనిచేసిన పీఎస్‌ శ్రీరామన్‌ను నియమించింది. అయితే తదుపరి తవ్వకాలలో ఏ ప్రమాణాలు, ఆనవాళ్లు దొరకలేదు.

కీళడిలో తవ్వకాలను ఆపడం లేదా ఆలస్యం చేయాలనే ఉద్దేశం తమకు లేదని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత రెండు సంవత్సరాలుగా జరిగిన పనులకు సంబంధించిన నివేదిక సకాలంలో అందని కారణంగా మూడవ సీజన్‌ తవ్వకానికి నిధుల కేటాయింపులో జాప్యం జరిగిందని వెల్లడిరచింది. కొద్ది కాలానికి మంత్రిత్వ శాఖకు నివేదిక అందింది. మూడవ సీజన్‌ తవ్వకాలకు నిధులు మంజూరు అయ్యాయి.

అమర్‌నాథ్‌ కీళడిలో వెలికితీసిన పురాతన నాగరికతపై ఏఎస్‌ఐకు సమర్పించిన నివేదిక వివాదానికి దారి తీసింది. నివేదికను సవరించాలని ఏఎస్‌ఐ ఆయన్ను కోరింది. అయితే అందుకు అమర్‌నాథ్‌ నిరాకరించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. నివేదికలోని కొన్ని పరిశోధనల డేటింగ్‌ను ఏఎస్‌ ఐ వేలెత్తి చూపింది. తొలి కాలానికి ఆధారాలను హడావుడిగా సమర్పించినట్టు ఉందని పేర్కొంది. మరింత విశ్లేషణ అవసరమని అంది. అయితే, నివేదికను తిరిగి రాయడానికి ఆయన నిరాకరించారు. శాస్త్రీయ పద్ధతులను, కఠినమైన పురావస్తు ప్రమాణాల ఆధారంగా నివేదికను పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. కాలక్రమం, స్తరిత శిలా శాస్త్రపు`స్ట్రాటోగ్రాఫిక్‌ క్రమాలు, పదార్థ సంవర్ధనం` మెటీరియల్‌ కల్చర్‌, ఏఎంఎస్‌ డేటింగ్‌ ఫలితాలకు తగ్గట్టుగా నివేదికను రూపొందించినట్టు తెలిపారు. ఏఎస్‌ఐ నివేదికను తిరగరాయాలంటూ కోరడంపై డీఎంకే, వీసీకే, ద్రావిడ కళగం నాయకులు, చరిత్ర కారులు వక్రభాష్యం చెప్పారు. తమిళ వారసత్వాన్ని అణచివేసే ప్రయత్నంగా దుష్ప్రచారం చేశారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి షెఖావత్‌ మాట్లాడుతూ అమర్‌ నాథ్‌ కనుగొన్న వాటికి సాంకేతికంగా ధ్రువీకరణకు నోచుకోలేదని తెలిపారు. వాటికి మరిన్ని డేటింగ్‌ ఫలితాలు, డేటా, ఆధారాల ఆవశ్యకతను మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకే ఒక తవ్వకంతో మొత్తం తర్కాన్ని మార్చలేమని అన్నారు. తమిళ నాడులో డీఎంకే సర్కారు మంత్రి వ్యాఖ్యలకు లేనిపోని అర్థాలను జోడిరచింది. కేంద్ర ప్రభుత్వానికి ‘‘తమిళులను రెండవ తరగతి పౌరులుగా చూడాలనే అపరిమితమైన కోరిక’’ ఉందని ఆరోపించింది. కేంద్రం ‘‘లేని సంస్కృత నాగరికతను’’ ప్రోత్సహిస్తూ తమిళ నాగరికతను అణచివేయడానికి ప్రయత్ని స్తోందని ఎండీఎంకే పార్టీ విమర్శించింది.

అమర్‌నాథ్‌ బదిలీ తర్వాత ఆయన స్థానంలో ఎస్‌ఏగా పనిచేసిన పీఎస్‌ శ్రీరామన్‌ 2017లో మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో కీళడిలో మూడవ దశ తవ్వకాలకు, 2017`18 మధ్య కాలంలో కొడుమనల్‌లో చేపట్టిన తవ్వకాలకు నేతృత్వం వహించారు. కీళడిలో మొదటి రెండు దశల తవ్వకాల్లో కనుగొన్న ఇటుక నిర్మాణా లకు సంబంధిం చిన మరిన్ని ఆనవాళ్లు బైటపడలేదని పేర్కొన్నారు. ఆయన 2019లో పదవీవిరమణ చేశారు. కీళడిలో మూడవ దశ తవ్వకాలపై, కొడుమనల్‌లో తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఏఎస్‌ఐ ఇటీవల శ్రీరామన్‌ను కోరింది.