
పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా భాజపా అధినాయకులపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గురువారం ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భయ్యాజీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది భాజపా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. దేశ విభజన అనంతరం పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలుగా ప్రకటించుకోవడంతో అక్కడ ఉన్న ముస్లిమేతరులు ఎన్నో హింసలను ఎదుర్కొన్నారు. క్రమంగా ఆయా దేశాల్లో హిందువుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఆ సమయంలోనే అక్కడినుంచి లక్షలాదిమంది హిందువులందరూ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్‌కు వలస వచ్చారు’ అని అన్నారు.
‘మన దేశ చట్టంలోని కొన్ని మార్గదర్శకాల కారణంగా ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారు భారత పౌరసత్వం పొందలేకపోయారు. ప్రస్తుతం పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లుతో అక్కడి నుంచి వలస వచ్చిన మైనారిటీలందరూ ఇక్కడ పౌరసత్వం పొందుతారు. శరణార్థుల జాబితా నుంచి వారి పేర్లు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ బిల్లు వల్ల భారత్‌లోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని అమిత్‌షా వ్యాఖ్యల్ని గుర్తుచేశారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనల గురించి మాట్లాడుతూ.. అక్కడి ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని చెప్పారు.





