News

ఆచారం పేరుతో వివాహితపై అత్యాచారం చేసిన ముస్లిం మత గురువు

671views

మహిళకు భర్తతో తలాక్‌ ఇప్పించిన మత గురువు అమెపై అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన 22 ఏళ్ల యువతి తలాక్‌ పద్ధతి ద్వారా విడాకులు పొందిన రోజే అత్యాచారానికి గురైంది. నవంబర్‌ 23న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆమె భర్తను, మత గురువును కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ ఏడాది ఏప్రిల్‌ 29న ఆ మహిళకు వివాహం జరిగింది. అన్వర్‌ ఖాన్‌ (51) అనే మత గురువుతో ఆమె భర్తకు పరిచయం ఉండేది. యువతికి ఇష్టం లేకపోయినా అన్వర్‌ తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. అతడి ప్రవర్తన హద్దు మీరటంతో ఆమె భర్తకు విషయం వివరించింది. కానీ అతడు దానిని తప్పుగా భావించలేదు. ఆ విషయమై భార్యాభర్తల మధ్య నవంబర్‌ 23న వివాదం చోటుచేసుకుంది. భర్త మూడు సార్లు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులిచ్చాడని, ఆమె తన భర్తను తిరిగి పొందాలంటే హలాలా ప్రకారం తనతో ఉండాలని అన్వర్‌ ఖాన్‌ ఆమెకు చెప్పాడని ఆశిష్‌భాగ్‌ నగర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ నాయర్‌ తెలిపారు.

‘నిఖా హలాలా’ ప్రకారం విడాకులచ్చిన ముస్లిం మహిళ వేరొక వ్యక్తిని వివాహం చేసుకుని, ఆచారం ప్రకారం కొంతకాలం విడిగా ఉన్న తరువాత అతడికి విడాకులిచ్చి మొదటి భర్తను మళ్లీ వివాహం చేసుకోవచ్చు. తన భర్త తనను కొట్టి ఆ మత గురువుతో వెళ్లమని బలవంతం చేసినట్టు ఆ యువతి తెలిపింది. అనంతరం ఆ మత గురువు బిస్మిల్లా నగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. ఈ ఘటన తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తే ఘోర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని భర్త, మత గురువు బెదిరించటంతో తాను వెంటనే ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. నిందితులపై ముస్లిం విమన్‌ యాక్ట్‌ 2019 ప్రకారం కేసు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.