తొందరెందుకు? తుది తీర్పు వచ్చే వరకు వేచివుండండి – శబరిమల ఆలయంలో నిషేదిత మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు.

శబరిమలలో ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడమనే అంశం అత్యంత సున్నితమైనదని, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, వారి భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని సుప్రీం కోర్టు పేర్కొంది. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పించి ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చేయలేమని పిటిషన్ దారులు బిందు అమ్మిని, రెహానా ఫాతిమాలకు కోర్టు స్పష్టం చేసింది.
అయ్యప్పస్వామి ఆలయంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ గత ఏడాది నాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలో ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ తరువాత కొందరు వామపక్ష సంస్థలకు చెందిన మహిళలు శబరిమల ఆలయ ప్రవేశానికి యత్నించగా కేరళలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. లక్షలాదిమంది మణికంఠుడి భక్తులు రోడ్ల మీదకి వచ్చారు. స్వచ్ఛందంగా ఆందోళనలు చేశారు. నిషేదిత మహిళలు ఆలయ ప్రవేశం చేయకుండా రక్షణగా నిల్చున్నారు.
దాంతోపాటుగా ఈ అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 69 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసు కింద తీసుకుని సుప్రీం కోర్టు కిందటి నెలలో విచారణ చేపట్టింది. ఒక్క శబరిమల ఆలయంలోనే కాకుండా మసీదుల్లో కూడా మహిళలకు ప్రవేశం లేదని, ఈ అంశాన్ని కూడా విచారించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏడుమంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.

రివ్యూ పిటీషన్లపై విచారణ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నందున గత ఏడాది ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. మరోసారి తాజా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బిందు అమ్మిని, రెహానా ఫాతిమా పిటీషన్లు వేశారు.
ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న సున్నితమైన అంశమని, దీనిపై ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్ణయాలు వెలువరించడం కుదరదని, కోర్టు తుది తీర్పు వెలువరించేవరకు పిటిషన్ దారులు వేచి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





