News

యాదగిరిగుట్టలో ఉదయాస్తమాన సేవలకు గరుడ టికెట్‌

255views

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ సమేత పంచనారసింహ ఆలయంలో.. తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు ఈవో వెంకట్రావు శనివారం తెలిపారు. ఇందుకోసం రూ.5 వేలతో గరుడ టికెట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులకు.. ఆలయంలో వేకువ జామున సుప్రభాతం సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు కొనసాగే పూజలన్నింటిలోనూ పాల్గొనే అవకాశం కల్పిస్తామని… ఐదు లడ్డూలు, కిలో పులిహోర ప్రసాదం, ఉత్తరీయం, వేదాశీర్వచనం అందజేస్తామని వెల్లడించారు. వైటీడీ పబ్లికేషన్స్‌ ద్వారా యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రికను రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. యాదగిరి టీవీ ఛానల్‌ ఏర్పాటుపై యోచిస్తున్నామన్నారు.

60 అడుగుల ఎత్తుతో ఐదు విగ్రహాలు: కొండ చుట్టూ ఉన్న కూడళ్లలో ఆంజనేయ, ప్రహ్లాదుడు, గరుడ, యాదమహర్షి, రామానుజుల విగ్రహాలను 60 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇందుకు రూ.3.6 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశామని ఈవో తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయ విద్యుత్‌ అవసరాల కోసం రూ.20 కోట్ల వ్యయంతో నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.