
కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తన రెండు కాళ్లనూ నరికేసినా… సైద్ధాంతిక నిబద్ధను ప్రదర్శిస్తూ ఆదర్శవంతంగా నిలిచిన సదానందన్ మాస్టారును రాజ్యసభకు రాష్ట్రపతి ముర్ము నామినేట్ చేశారు. దీనిపై జాతీయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదానందన్ ను రాజ్యసభకి నామినేట్ చేయడం ద్వారా ఓ విద్యాధికుడు, సామాజిక సేవకుడికి అద్భుతమైన గౌరవం లభించినట్లైంది.
అయితే.. తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నా… జాతీయవాదాన్ని కేరళలో వేగంగా, బలంగా విస్తరించినా, వామపక్షవాదులు పాశవిక దాడికి దిగినా, ఏమాత్రం భయపడకుండా, వెనకడుగు వేయకుండా తన ఉపాధ్యాయ వృత్తిని అత్యంత నిబద్ధతతో సదానందన్ మాస్టార్ నిర్వహించారు. అయినా… సీపీఎం కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన కేరళ మీడియాకి ఇవేవీ కనిపించవు. మాస్టార్జీ పోరాటాన్ని ఏమాత్రం అక్కడి మీడియా పట్టించుకోలేదు. పైగా తన అసహనాన్ని బహిర్గతం చేసి, అందరి ముందూ అభాసుపాలైంది.
ధైర్యానికి, దృఢత్వానికి ప్రతిరూపం మాస్టార్ జీవితం
సదానందన్ మాస్టారు జీవితం ధైర్యత్వానికి, దృఢత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా కన్నూర్ లో ఉపాధ్యాయునిగా, పెరమంగళంలోని దుర్గా విలాసం హయ్యర్ సెకండరీ స్కూల్ లో సాంఘిక శాస్త్రాన్ని బోధించారు. గౌహతి, కాలికట్ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలను పొందారు. ప్రస్తుతం కేరళలోని నేషనల్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా వున్నారు. అలాగే దేశీయ అధ్యాపక వార్త అన్న పబ్లికేషన్స్ కూడా నడుపుతున్నారు.
1994 తర్వాత విషాద మలుపు తీసుకున్న జీవితం
అయితే 1994 జనవరి 25 న కమ్యూనిస్టు గుండాలు అతనిపై పాశవికంగా దాడి చేశారు. అతని కాళ్లను కూడా నరికేశారు. దీంతో అతి జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది.ఇప్పుడు మాస్టార్ సందానందన్ కృత్రిమ అవయవాలతో నడుస్తున్నారు. కానీ.. తన ప్రజా జీవితం నుంచి, జాతీయవాద విస్తరణ నుంచి ఎన్నడూ వెనక్కి వెళ్లిపోలేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కూతుపరంబ అన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ప్రధాని మోదీ కూడా అతని ప్రచారం కోసం హాజరయ్యారు.
అయితే.. ఇన్ని దశాబ్దాలుగా ఆయన ప్రజా జీవితంలో, సామాజిక జీవనంలో, విద్యావేత్తగా కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సదానందన్ మాస్టార్ను మాత్రం కేరళ మీడియా అంతగా పట్టించుకోలేదు. ఆయన వృత్తిపరమైన గుర్తింపును, స్థాయిని గుర్తించడానికి మీడియాకి ఏం అడ్డువచ్చిందో తెలియదు. పోనీ… సీపీఎం అనుబంధ మీడియాలో ప్రస్తావించకుంటే పర్లేదు. మిగతా మీడియాకి ఏమైందో అర్థం కావడం లేదు. కావాలనే కుట్రతో, వామపక్షీయుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది.
ఆయన్ను కేవలం ‘‘సి. సదానందన్’’ అని మాత్రమే సంబోధిస్తుంటుంది. కేరళలో ఉపాధ్యాయ వృత్తిలో ఎవరున్నా గౌరవప్రదంగా ‘‘మాస్టార్’’ అనే పదంతోనే సంబోధిస్తారు. కానీ అక్కడి ఎర్ర మీడియా మాస్టర్ అన్న పదాన్ని సదానందన్ ముందు చేర్చదు. పదాన్ని తొలగించేశాయి. ఇదేదో అనుకోకుండా జరిగిన పొరపాటు కానేకాదు. కేవలం కేరళ, కన్నూర్ ప్రాంతాల్లో సీపీఎం కనుసన్నల్లోనే నడిచే జర్నలిస్టులుంటారు. వీరే అక్కడ ఎక్కువగా పాతుకుపోయారు. మాస్టార్ సదానందన్ విషయంలో అక్కడి మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోందని ఇట్టే అర్థమైపోతుంది.
వామపక్షవాదులకైతే అమితమైన ప్రేమ ఒలకబోస్తున్న మీడియా
పై దానికి విరుద్ధంగా వామపక్ష నేతల విషయంలో మాత్రం చాలా మర్యాదనిస్తుంటారు. ఉదాహరణకు సీపీఎంతో అనుబంధంగా వున్న సీపీఎం కేరళ కార్యదర్శి పేరు ఎం.వీ. గోవిందన్. ఆయన్ను గోవిందన్ మాస్టార్ అని, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, సీపీఎం నాయకురాలు కే.కే. శైలజను మాత్రం శైలజ టీచర్ అని, మరో నాయకురాలు పీ.కే. శ్రీమతిని టీచర్ శ్రీమతి అని మీడియా సంబోధిస్తుంటుంది.
ఈ మీడియా వివక్షను కేవలం జాతీయవాదులే ఎత్తిచూపడం లేదు. కాంగ్రెస్ కూడా మీడియా పక్షపాతాన్ని చూపిస్తోంది.కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సదానందన్ ముందు కేరళ మీడియా మాస్టార్ అని చేర్చడం లేదని పేర్కొన్నారు కూడా.





