ArticlesNews

ఆ ఆలయంలో అన్నదానం చెయ్యడానికి వీల్లేదంటూ తాళాలేసిన టీటీడీ అధికారులు

2.1kviews

సలీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రోజు రోజుకీ హిందువులపై, హిందూ దేవాలయాలపై ఏదో ఒక మిషతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రభుత్వము, పాలకులు, అధికారులు అందరూ మూకుమ్మడిగా హిందువులపై పగబట్టారా? అనిపిస్తోంది.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్థానిక భక్తులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకుని టీటీడీ అధికారులు మరోసారి తమ హిందూ వ్యతిరేక ధోరణిని చాటుకున్నారు. జరిగిన పరిణామంతో గ్రామస్తులందరూ నిశ్చేష్టులయ్యారు. టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంఘటన పూర్వాపరాలను ఓసారి పరిశీలిద్దాం…

మహమ్మదీయుల పాలనలో హిందూ సంస్కృతి పైన, ఆచార వ్యవహారాల పైన, హిందూ సనాతన ధర్మానికి ఆలవాలమైన దేవాలయాల పైన దాడి చేసి సమూలంగా నాశనం చెయజూస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని అతి పురాతనమైన, చరిత్ర ప్రాశస్త్యం కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని మూలవిరాట్టును కాపాడుకోవాలనే సదుద్దేశంతో స్థానికులు కోనేటిలో నిక్షిప్తం చేశారు.

ఎన్నో సంవత్సారాలు ఆ కోనేటి లోనే ఉన్న ఈ మూలవిరాట్టును పునః ప్రతిష్ట చేసిన అనంతరం కొన్ని సంవత్సరాలు కోనేటిలోనే ఉన్నందున  కోనేటి రాయుడుగా స్వామి ప్రసిద్ది పొందారు. ఎన్నో వందల ఏండ్ల మహోన్నత చరిత్ర గలిగిన పుణ్యక్షేత్రమిది. పద కవితా పితామహుడు అన్నమయ్య “కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” అని కీర్తించింది ఈ స్వామినే.

గతంలో ఈ దేవస్థానం ఆలనాపాలనా , నిత్య ధూప నైవేద్యాలకు, దేవస్థానం శాశ్వత నిర్వహణకు, సేవా కార్యక్రమాలకు పుంగనూరు జమీందారులు వందలాది ఎకరాలు ఈ దేవస్థానానికి కేటాయించి వాటిపై వచ్చే రాబడితో దేవస్థానం యొక్క నిర్వహణ చేస్తూ ఉండేవారు. అనంతరం కొంతమంది దాతల మరియు గ్రామస్తుల సహకారాలతో  దేవస్థానం నిర్వహణ కొనసాగింది. తర్వాత కాలంలో ఈ దేవస్థానాన్ని  తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయంగా చేర్చడం జరిగింది.

సహజంగానే ప్రాచుర్యం కలిగిన దేవస్థానం కావడం, పైగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్వహణలోకి రావడంతో ఆలయం యొక్క ప్రతిష్ఠ మరింత పెరిగింది. దీంతో భక్తుల యొక్క రాకపోకలు అధికముగా ఉండుటవలన పలమనేరు పట్టణ ప్రజలు మరియు కీలపట్ల  గ్రామస్తులు అందరూ ఒక నిత్య అన్నదాన కమిటీగా ఏర్పడి దానికి కావలసిన నిధులను స్వంతంగా సమకూర్చుకొని గతంలో ఆ దేవస్థానంలో శిధిలావస్థలో ఉన్న గదులను పునర్నిర్మాణం చేసి అందులో దర్శనానికి వస్తున్న భక్తులకు, వృద్ధులకు, వికలాంగులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తూ ఆ దేవ దేవుని యొక్క సేవలో తరిస్తున్నారు, ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గాని ఎండోమెంటు వద్ద నుండి గాని తీసుకోలేదు.

కానీ రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఏమాత్రం సమయం ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రదేశంలో ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రైవేటుగా చేసేందుకు అధికారము లేదు అంటూ ఆ గదులను సీజ్ చేశారు. ఎంత ప్రాధేయపడినప్పటికీ అప్పటికే 500 మంది భక్తులకు సరిపడా తయారుచేసిన అన్న ప్రసాదాలను భక్తులకు పంచడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ పదార్థాలను, వస్తువులను నిర్ధాక్షణ్యంగా బయట పడేశారు.

ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్న ట్రస్ట్ వారు “అయ్యా మేము ఈ ట్రస్టు ద్వారా సుమారు ఆరున్నర లక్షల రూపాయలు దాతల ద్వారా సేకరించి ఆంధ్ర బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ఉన్నాము, మరియు రెండు వేల మంది భక్తులకు కావలసిన వంటకు సరిపడే వంటసామాన్లు సమకూర్చుకొని ఉన్నాము . ఈ సదరు లక్షలాది రూపాయలను, ఈ వంటసామాన్లను మీకే అప్పగిస్తాం, మీ ద్వారానే నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించండి” అని కాళ్లావేళ్లా పడినా కరగని అధికారులు నిర్ధాక్షణ్యంగా సీలు వేసినారు. ఎందుకంటే “ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాపర్టీ. రూల్స్ కు విరుద్ధంగా మేము నడుచుకోవడానికి వీలులేదు” అని ఖరాకండిగా తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని సంతరించుకుని, భక్తుల రాకపోకలతో కళకళలాడుతున్న దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు ఉచిత అన్నదాన పథకాన్ని అడ్డుకోవడంలో టీటీడీ పెద్దల ఆంతర్యమేమిటి? “సరే ఆ ఉచితాన్నదాన పథకమేదో మీరే నడపండి, మేము సేకరించిన నిధులు, పరికరాలు అన్నీ మీకే అప్పగిస్తాం” అంటే కూడా అంగీకరించకపోవడం ఏమిటి? అతి ప్రాచీనమైన, పురాతనమైన దేవాలయంలో టీటీడీ నుండి గానీ ఎండోమెంట్స్ నుండి గాని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం భక్తుల  సహాయ సహకారాలతో సంవత్సరాలుగా నడుస్తున్న అన్నదానాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మూసివేయడం లో చూపిస్తున్న అత్యుత్సాహం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఒక మహోన్నతమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే దానిని ఆపడం ఎంతవరకూ సమంజసం? ముందస్తు నోటీసులుగానీ, సమయంగానీ ఇవ్వకుండా అంత హడావుడిగా సీజ్ చెయ్యడానికి అక్కడ జరుగుతున్నది అసాంఘిక కార్యకలాపాలు కాదే? అన్నదాన కార్యక్రమం. దానిని నిలుపుదల చెయ్యడానికి ఎందుకంత ఆత్రం? ఏమంత తొందరొచ్చింది?

తిరుమల తిరుపతి దేవస్థానం లో మరి హిందూ దేవస్థానములో అన్యమతస్తులు ఉద్యోగస్తులుగా ఉండకూడదని అనే చట్టం ఉన్నా, నిత్యం మత ప్రచారంలో మునిగిపోయి స్వంతంగా చర్చిలు నిర్వహిస్తున్న అధికారులు ఉన్నా వారి  పైన చర్యలు తీసుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా విభాగం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు?  అని భక్తులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సమాజం స్పందించి సహృదయతతో, సద్భావంతో కులాలకు, రాజకీయాలకు అతీతంగా తామందరం కలిసి నిర్వహిస్తున్న ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమ నిర్వహణకై తాము భవిష్యత్తులో చేయబోయే పోరాటానికి అందరూ సహకరించాలని, కుల, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా అందరూ ధర్మం వైపు నిలవాలని అన్నదాన ట్రస్ట్ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.