
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సంతృప్తికర, సులభతర దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ అన్నారు. మహానంది ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రసాదాల తయారీ, ఇతర విభాగాల్లో క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠరాజు, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్యలతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ గురుప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓ హోదా నుంచి ఆర్‌జేసీ హోదా కలిగిన ఆలయాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారని చెప్పారు. ఆర్జిత సేవలతో పాటు ప్రసాదం తయారీ, అన్నప్రసాదం పంపిణీ, క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారన్నారు. ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. మాడవీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.




