News

రూ. 100 కోట్లతో ముంబయి సిద్ధి వినాయక టెంపుల్ ఆధునికీకరణ

275views

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయ పరిసరాలను ఆధునికీకరించేందుకు మూడు దశల సుందరీకరణ ప్రణాళికను రూపొందించింది. దాదర్, మహిమ్, ధారవి, వర్లి, లోయర్ పరేల్ వంటి ప్రాంతాలను కవర్ చేసే ఈ ప్రాజెక్టును G నార్త్, G సౌత్ వార్డులు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే వేలాది భక్తులకు సౌకర్యాలు కల్పించడం ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. మొదటి దశ లో ఖర్చు రూ.100 కోట్లు దాటుతుందని సీనియర్ అధికారి నేషనల్ మీడియాకు తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గించేలా
తొలి దశలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మొదలైన చర్యలు చేపట్టనున్నారు.. రోడ్డుపై పార్కింగ్ గందరగోళాన్ని నివారించేందుకు రెండు భూగర్భ పార్కింగ్ స్థలాల నిర్మాణం ప్రతిపాదించారు. ఆలయ ప్రధాన ద్వారం ‘సిద్ధి గేట్’గా పునర్మిస్తారు. ఆకర్షణీయమైన పాలరాయి చెక్కడం, పైకప్పు పందిరి ఉంటాయి. ప్రాంగణ చుట్టూ ఫ్లోరింగ్ పునరుద్ధరిస్తారు. ఈ దశ పూర్తిగా గర్భగుడి లేదా అంతర్గత ఆలయ నిర్మాణాలను ప్రభావితం చేయకుండా అభివృద్ధి చేస్తుంది.

పార్కింగ్ సదుపాయాలు
రెండో దశలో భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. ప్రత్యేక సౌకర్య కేంద్రం, అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్ వెంబడి రెండో ప్రవేశ ద్వారం ‘రిద్ధి గేట్’ నిర్మిస్తారు. భూగర్భ పార్కింగ్ సదుపాయాలు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) మౌలిక సదుపాయాలతో కలిసిపోతుండటంతో, నిర్మాణం ప్రారంభం వారి తుది అనుమతిపై ఆధారపడి ఉంటుంది. అనుమతి లభించిన తర్వాత టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాజెక్ట్‌ను అధికారిక ప్రారంభ తేదీ నుంచి 12 నెలల్లో పూర్తి చేయాలని BMC లక్ష్యంగా పెట్టుకుంది.