News

గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

240views

జూలై 09, 10వ తేదీల్లో జరగనున్న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేశారు. సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జాయింట్ కలెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, దేవ‌స్థానం, జీవీఎంసీ, పోలీసు అధికారుల‌తో క‌లిసి వివ‌ధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అప్పూఘ‌ర్ స్నాన ఘ‌ట్టం, వెంకోజీపాలెం, సీత‌మ్మ‌ధార‌, మాధ‌వధార‌, ముర‌ళీన‌గ‌ర్, ప్ర‌హ్లాద‌పురం, కుమారి క‌ల్యాణ మండ‌పం మీదుగా సింహాచలం తొలి పావంచా వ‌ర‌కు వివిధ ప్రాంతాలను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. సింహాచలం తొలిపావంచా వ‌ద్ద చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై, ఇత‌ర ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ కు చేరుకొని క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన అంశాల‌పై స‌మీక్షించారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగ‌ళ‌వారం సాయంత్రం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ, దేవస్థానం, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులతో ఆయ‌న‌ సమీక్షించారు. ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసి దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 09వ తేదీ తెల్లవారు ఝాము నుంచి 10 సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తులను, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల‌ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాటలు లేకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారుల‌కు సూచించారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, 400 మరుగు దొడ్లు, పారిశుధ్ధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని జీవీఎంసి అధికారులను ఆదేశించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్లను శిబిరాల వద్ద ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాంతాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ స‌రఫ‌రా ఉండాలని, అవసరమైన మేర‌కు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.

అప్పూఘర్ వద్ద భక్తులు స్నానాలు చే సమయంలో ఏ విధమైన నీటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పాలని, గజ ఈతగాళ్ల‌ను అందుబాటులో ఉంచాలని, స‌ముద్ర తీరంలో బోట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని మత్స్యశాఖ అధికారులకు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా 09, 10వ తేదీల్లో మద్యం షాపులను మూయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్ధం అవసరమైన బస్సులను నడపాలని ఆర్.టి.సి. అధికారులకు సూచించారు. స్వామివారి కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రిక ప‌రిక‌రాల‌తో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న మరుగుదొడ్లతో పాటు రహదారిలో ఉండే పాఠశాలలు, కళ్యాణ మండపాల్లోని మరుగుదొడ్లను వినియోగించుటకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, భ‌క్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా హాల్టింగ్ పాయింట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. సమాచార శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది, ఇత‌ర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు కమాండ్ కంట్రోల్ వద్ద ఉండాలని సూచించారు. ఛైల్డ్ కేరింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించాల‌ని, విద్యుత్ తీగ‌లు వేలాడ‌కుండా చూడాల‌ని, గిరి ప్ర‌ద‌క్షిణ జ‌రిగే దారిలో వాహ‌నాలు అడ్డ‌దిడ్డంగా పెట్ట‌కుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో సహాయం కొర‌కు యాప్

అనుకోని రీతిలో ఎవ‌రికైనా అత్య‌వ‌స‌ర‌ వైద్య సేవ‌లు, గానీ ఇత‌ర సేవ‌లు గానీ అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక యాప్ ద్వారా సాయం అందించేందుకు యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కు సంబంధించి అస్త్రం యాప్ ద్వారా సాయం పొంద‌వ‌చ్చ‌ని సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీ తెలిపారు. సీసీ కెమెరాలు పెట్టాల‌ని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాల‌ని సీపీ సూచించారు. తొక్కిస‌లాట‌కు తావులేకుండా ప‌టిష్ట ఏర్పాట్లు చేసేందుకు అన్ని విభాగాల అధికారులు స‌హ‌కారం అందించాల‌న్నారు. ప‌టిష్ట‌మైన బారికేడింగ్ ఏర్పాటు చేయాల‌ని, హ‌నుమంతువాక‌, ఇసుక‌తోట జంక్ష‌న్ల వ‌ద్ద తాత్కాలిక వంతెన‌లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అంబులెన్సులు, నీటి ట్యాంకులు సుల‌భంగా మూవ్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించ‌గా… ముంద‌స్తు స‌మాచారం అందించిన‌ట్లయితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ చెప్పారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల వారు ఏర్పాటు చేసే కౌంట‌ర్లు భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.