ArticlesNews

దేశ చ‌రిత్ర‌లో చీక‌టి కాలం.. ఎమ‌ర్జెన్సీ

441views

( జూన్ 25 – ఎమ‌ర్జెన్సీ విధించిన రోజు )

అంత‌ర్గ‌త క‌ల్లోలం కార‌ణంగా జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లిందంటూ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని చీక‌టి రోజుల్లోకి నెట్టింది. నాటినుంచి 1977 మార్చి 21న‌ ఎమర్జెన్సీ ర‌ద్ద‌య్యే వ‌ర‌కూ దేశమంతా నియంత దుర్మార్గ పాలనలో అల్లాడిపోయింది. పౌరుల ప్రాథ‌మిక హ‌క్కులు, స్వేచ్ఛ బ‌లైపోయాయి. లక్ష మందికి పైగా ప్రతిపక్ష శ్రేణులను, స్వేచ్ఛ కోసం నినదించిన విద్యార్థులు, యువత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకర్తలతో జైళ్లను నింపేశారు.

1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుండి సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్‌పై విజయం సాధించారు. ఎన్నికల అక్రమాలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమె ఎన్నికను రాజనారాయణ్ సవాలు చేశారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని అల‌హాబాద్ హైకోర్టు నిర్ధారించింది. ఆమెను పార్లమెంట్‌కు అనర్హురాలిగా ప్రకటించింది. ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించకుండా ఆమెపై జస్టిస్ సిన్హా ఆరేళ్ల నిషేధం విధించ‌డంతో దేశంలో చీకటి పాలనకు అంకురార్పణ జరిగింది. ఈ తీర్పు వచ్చిన రోజే గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ సీఎం చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వం కూలిపోయి జనతా ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. దానితో దేశంలో కాంగ్రెస్ పాలనకు చివరి రోజులు వ‌చ్చాయ‌నే ఆందోళ‌న‌తో.. జాతీయ భద్రతకు ప్రమాదం సాకుతో అత్యవసర పరిస్థితి విధించారు. దీనికి 1971లో పాకిస్థాన్‌తో యుద్ధాన్ని సాకుగా చూపారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అసమ్మతిని అణ‌చివేయడం, పౌర హక్కులను కాలరాయడంతోపాటు మీడియాను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేశారు.

వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై అతిపెద్ద దాడి స్టాలిన్ హ‌యాంలో రష్యాలో జ‌రిగింది. ఆ తర్వాత ఆ స్థాయి దాడి భారత్‌లో ఇందిరా గాంధీ హయాంలోనే జరిగింది. అత్యవసర పరిస్థితి స‌మ‌యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు వందలాది మంది జర్నలిస్టులు జైలు పాలయ్యారు. స్వతంత్ర పత్రికలు త‌మ ఉనికి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాక్ స్వేచ్ఛ అణచివేయబడింది. ఏరోజుకారోజు ప్రచురించే ప్రతి వార్తను ముద్రణకు వెళ్లే ముందు ప్రభుత్వం పరిశీలించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఒక ఆర్డినెన్స్‌తో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ర‌ద్దు చేశారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ప్రపంచ సూచిక జాబితాలో భారతదేశ స్థానం అట్ట‌డుగుకు పడిపోయింది. ఎమ‌ర్జెన్సీ విధించిన త‌ర్వాత జూన్ 26న దేశంలో ప్రచురిత‌మైన ఏకైక వార్తాపత్రిక ‘మదర్‌ల్యాండ్’ త‌న ఎడిషన్‌లో అత్యవసర పరిస్థితి గురించి, దానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అరెస్టులు, నిరసనల గురించి ప్ర‌జ‌ల‌కు తెలియజేసింది. దీంతో ఆ సంస్థ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే పొరుగున ఉన్న ‘జన్‌యుగ్’ ప్ర‌తిక ఈ సంస్థ కార్యాలయానికి విద్యుత్ అందించింది. `ఇండియన్ ఎక్స్‌ప్రెస్`, `ది స్టేట్స్‌మన్` ప‌త్రిక‌లు ఎమ‌ర్జెన్సీపై నిరసన తెలుపుతూ తమ సంపాదకీయ పేజీలను ఖాళీగా ఉంచాయి. ఆ త‌ర్వాత ఇతర ప‌త్రిక‌లు కూడా వీరి బాట‌లోనే న‌డిచాయి.

అత్యవసర పరిస్థితి స‌మ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రికలు పాంచజన్య, ఆర్గనైజర్, మదర్‌ల్యాండ్, తరుణ్ భారత్, వివేక్, విక్రమ్, రాష్ట్రధర్మ్, యుగ్‌ధ‌ర్మ్. ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మదర్‌ల్యాండ్, ఆర్గనైజర్ ఎడిట‌ర్ కేఆర్. మల్కాని ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట‌యిన‌ మొదటి జర్నలిస్ట్. ఎమర్జెన్సీ ముగిసే వరకు ఆయ‌న జైలులోనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు అందరూ జైళ్లలో ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఎటువంటి చర్చ లేకుండానే రాజ్యాంగ సవరణలు చేశారు. నిర్బంధాలను ఎదిరించి ఉధృతమవుతున్న నిరసన ఉద్యమాలు ఒకవైపు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడుల కారణంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటేన‌ని ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం ఇందిరాగాంధీ అంగీకరించారు. మరో వెయ్యేళ్ళ వరకు ఎవ్వరూ దేశంలో అటువంటి సాహసం చేయబోరని ఇందిర‌ ప్రకటించడం విశేషం.