News

గో సంరక్షణకు సమగ్ర విధానం

198views

తెలంగాణలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనానికి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోసంరక్షణ కోసం తొలుత వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశువైద్య విశ్వవిద్యాలయం సమీపంలో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయాలన్నారు. గోసంరక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

‘‘మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వాటి సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన జరగాలి. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారు. స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మిస్తాం. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలి. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో వ్యవహరించాలి. గోసంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదు’’ అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుపై విధానపత్రాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి అధికారులు సీఎంకు అందజేశారు. సబ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, రఘునందన్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.