
( జూన్ 4 – తియానన్మెన్ స్వ్కేర్ ఊచకోత )
హిరోషిమా మీద అణుబాంబు పడిన ఆగస్టు8 విషాదం స్మరించుకున్న రీతిలోనే జూన్4న చైనా కమ్యూనిస్టు పార్టీ తియానన్మెన్ స్వ్కేర్‌లో గావించిన ఊచకోతని ప్రపంచం స్మరించుకుని, అటువంటి ఊచకోతకి చైనా మరోసారి పాల్పడకుండా కట్టడి చేయాల్సి ఉండగా, ఆ సంఘటనను ప్రపంచదేశాలు దాదాపుగా మరచిపోయాయి. చైనాలో ప్రజాస్వామ్య ఉద్యమం నడిపిన ప్రజల త్యాగాలను పట్టించుకోకపోవడం నాటి విషాదాన్ని మించిన విషాదం.
దశాబ్దాల పాటు ఎర్రజెండా నియంతృత్వం కింద నలిగిపోయిన చైనీయులు, ఆ నియంతృత్వ పార్టీ నాయకులు చిదిమేసిన జీవితాలను స్మరించడం మొదలైంది. కమ్యూనిస్టు పాలనలో కోట్లాదిమంది రాత్రికిరాత్రి మాయమై అజ్ఞాత ప్రదేశాల్లో శవాలగుట్టల్లో కలిసిపోయారు. ఆ అణచివేత దేశంలో ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే ఆగతుందని భావించిన చైనా యువత ప్రజాస్వామ్యం, పౌరహక్కుల కోసం ఉద్యమం బాట పట్టింది.
అణచివేతలను భరిస్తూ, ధైర్యంగా గొంతు విప్పుతూ ఏప్రిల్ 15, 1989 నాటికి విద్యార్థులు, యువతీయువకులు బీజింగ్‌లోని తియానన్మెన్ స్వ్కేర్‌లో చేరారు. నాటి నుండి జూన్ 3 వరకు తమ ప్రజాస్వామ్య డిమాండ్ కోసం ప్రదర్శనలు చేసారు. నిరాహారదీక్షలు చేయడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ మీడియా మొత్తం తియానన్మెన్ స్వ్కేర్‌కి చేరింది. చైనా నియంత పాలకులు యుద్ధ ట్యాంకులను అక్కడికి తెచ్చి బెదిరించ యత్నం చేసారు. ఆ యుద్ధ ట్యాంకు ఎదుట ఒకే ఒక్క యువకుడు నిరాయుధుడిగా నిలబడి తన హక్కు కోసం నినదించిన ఫోటో ప్రపంచవ్యాప్తమైంది.
ప్రజాస్వామ్యం కోరుతున్న యువతతో చైనా కమ్యూనిస్టు నియంత పాలకులు కంటి తుడుపు చర్చలు జరిపారు. యువతలో ఈ ధైర్యం రావటానికి కమ్యునిస్టు పార్టీలోని కొందరు కారణమని అగ్రనాయక బృందం భావించింది. చైనా పాలనలో సంస్కరణలు అవసరం అని నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ హు యావో బాంగ్ వాదించాడు. మావో ఉక్కు పిడికిలి పాలన నుండి బయటకు వచ్చి విదేశీ పట్టుబడులతో పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదిగిన చైనా ఇకపై నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు మళ్ళటం అవసరమన్నది నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి భావన. అయితే పార్టీ అంతర్గత చర్చలలో తమ ప్రధాన కార్యదన్శినే వారు ఖతం చేసారు.
విద్యార్థుల నిరాహార దీక్షతో ప్రజాస్వామ్య ఉద్యమం 400 నగరాలకు పాకింది. ఇక ప్రజాస్వామ్య డిమాండ్ పెరిగితే తమ కమ్యూనిస్టు పార్టీ మనుగడ కష్టం అని భావించిన ఆ పార్టీ మే 20న సైనిక పాలన విధించి బీజింగ్ నగరంలోకి 3 లక్షల మంది సైనికులను దించింది.
1989 జూన్ 3వ తేదీ రాత్రి సైనిక దళాలు తియానన్మెన్ స్వ్కేర్‌లోకి ట్యాంకులతో, ఆయుధాలతో వచ్చాయి. విద్యార్థులు, యువత తిరగబడ్డారు. హింసతో లొంగదీసుకోవాలన్న ఆలోచన చైనా కమ్యూనిస్టు పార్టీ వారిది. నాల్గవ తేదీ సాయంత్రానికి మొత్తం స్వ్కేర్‌ని ఖాళీ చేయించారు. సైనిక పాశవిక దాడిలో ఎన్నో వేల మంది మరణించారు. మరెన్నో వేల మంది గాయపడ్డారు. నిరసనకారులను సుదూర సైనిక శిబిరాలకు తరలించి కాల్చి చంపారు. జైళ్ళల్లో కుక్కారు. 1989లో తప్పిపోయిన వారి జాడ నేటి వరకు తెలియదు. ఆ విషయం మీద చైనా నోరు విప్పదు. విదేశీ పత్రికలవారిని చైనా నుండి బహిష్కరించారు.
తియానన్మెన్ స్వ్కేర్‌లోకి రెండు వైపుల నుండి సైనిక దళాలు ప్రవేశించి తమ దేశ విద్యార్థుల మీద యుద్ధం చేశాయి. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాయి. యుద్ధ ట్యాంకులను తెచ్చారు. అవి ప్రయోగించారా, బెదిరించటానికి వాడారో తెలియదు కానీ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేశారు.
జూన్ 6న విడుదలైన అధికారిక ప్రకటనలో 300 మంది మరణించారు. ఐదువేల మంది గాయపడ్డారు. వారందరికి ఆ శిక్ష తగినదే. దారి తప్పిన యువతను తిరిగి సరైన పార్టీ పంధాలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నాడు మరణించిన భద్రతాబలగాలకు అమరవీరులుగా నివాళులర్పించింది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా. ఎర్రజెండా నీడలో శ్మశాన ప్రశాంతత తీసుకువచ్చారు తియానన్మెన్ స్వ్కేర్‌లో.
ఇంత నిరంకుశ అణచివేత, హత్యాకాండ చేసినా కూడా చైనాను ప్రపంచం నిలదీయలేదు. ప్రపంచ ప్రజాహక్కుల వేదికలతో సహా భారతీయ కమ్యూనిస్టు పార్టీలు కూడా పట్టనిదనం ప్రదర్శించాయి.





