News

రెడ్ రోడ్ లో ఈద్ ప్రార్థనలను అనుమతించం : భారత ఆర్మీ

311views

కలకత్తాలోని రెడ్ రోడ్ లో ఈ సారి ఈద్ ప్రార్థనలు నిర్వహించడానికి వీల్లేదని సైనికాధికారులు తేల్చి చెప్పారు. సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవడానికి భారత సైన్యం నిరాకరించింది. ఫోర్ట్ విలియంలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ముందున్న ఈద్ ఉల్ జుహా దగ్గర సామూహిక ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ సారి తమకే అవసరం వుందని, సైనిక ప్రయోజనాల రీత్యా ప్రార్థనలకు అనుమతి లేదని ఆర్మీ స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని భారత సైన్యం కలకత్తా పోలీసులతో పాటు కలకత్తా ఖిలాఫత్ కమిటీకి కూడా అధికారికంగా తెలియజేసింది. ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది. ‘‘“జూన్ 7 లేదా జూన్ 8 2025న రెడ్ రోడ్ జనరల్ ఏరియాలో ఈద్-ఉజ్-జోహా కోసం సామూహిక ప్రార్థన నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ స్థలం ‘‘సైనిక ప్రయోజనాల కోసం అవసరం వుంది’’ అని ఆ ప్రాంతానికి బాధ్యత వహించే కల్నల్ ర్యాంక్ అధికారి ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే ప్రోటోకాలం ప్రకారం కలకత్తా ఖిలాఫత్ కమిటీ నేతాజీ విగ్రహం నుండి ఫోర్ట్ విలియం తూర్పు ద్వారం ప్రవేశ ద్వారం వరకు ఈద్ ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతి కోసం గత నెల 10 వ తేదీన దరఖాస్తు చేసుకుంది. మే 31 న ఈ అభ్యర్థనను సైన్యం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీనిని బెంగాల్ విపత్తు శాఖ సహాయ మంత్రి, కలకత్తా ఖిలాఫత్ కమిటీ సభ్యుడు జావేద్ అహ్మద్ ఖాన్ కూడా ధ్రువీకరించారు. అంతేకాకుండా దీనిపై ఏం చేయాలన్న దానిపై కూడా సమావేశమై, నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

రెడ్ రోడ్డు వద్ద పెద్దఎత్తున ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఇందులో రాజకీయ నేతలు కూడా పాల్గొంటారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గతంలో ఇక్కడి ప్రార్థనలకు హాజరై, ప్రసంగించారు.