
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని మతమార్పిడి చేయడానికి సాగుతున్న కుతంత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారుల అలసత్వం, మరికొందరి కుట్రల వల్ల హిందూ ధర్మానికి పెద్ద సవాలుగా పరిణమించే పన్నాగాలు చాప కింద నీరులా సాగుతున్నాయి. ఇంకొన్ని బహిరంగంగానే జరుగుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ అచ్చంపేటలో జరిగిన ఉదంతం.

‘చంద్రన్న కానుక’ పథకం కింద క్రిస్మస్ కి క్రైస్తవులకు కానుకగా పౌరసరఫరాల శాఖ తరఫున నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. దీనిలో పప్పులు, ఉప్పులు, నెయ్యి, నూనెలు ఇలా సుమారు 200 రూపాయలకు పైగా విలువైన వస్తువులను ఒక గిఫ్ట్ ప్యాక్ గా తెల్ల రేషన్ కార్డు కలిగిన క్రైస్తవులకు అందజేసే పథకం ఇది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని ఎస్.సి కాలనీలో కూడా ఈ పథకం కింద క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణీ చేశారు. దీని వెనుక అసలు విషయం తెలుసుకున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కార్యకర్త చింతలపాటి పురుషోత్తమ శర్మ, గుట్టు లాగే ప్రయత్నం చేశారు. గత ఆగష్టులో కోగంటివారి పాలెం, అంబడిపూడి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చంద్రన్న క్రిస్మస్ కానుక ఇవ్వడానికి ఏ ప్రాతిపదికన లబ్దిదారులను ఎంపిక చేశారో తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) కింద అచ్చంపేట తహసిల్దారుకి దరఖాస్తు చేశారు. గ్రామాల్లో నివసిస్తున్న ఎస్.సి కులాలవారందరికీ క్రిస్మస్ కానుక అందజేశామని మండల సమాచార అధికారి స్పష్టత లేని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై ఇంకా సమగ్ర సమాచారం కోసం ఆర్.టి.ఐ కార్యకర్త పై అధికారికి గత అక్టోబర్లో మరో లేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై కూడా సమాచార అధికారి ఇలాంటి సమాచారమే ఇస్తూ.. ఈ గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న ఎస్.సి లకు క్రిస్మస్ కానుక పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీనిపై ఒక ఆంగ్ల దిన పత్రిక మరింత లోతుగా విచారించడానికి సంబంధిత తహసిల్దార్ ని సమాచారం అడగ్గా ఎస్.సి లకు క్రిస్మస్ కానుక ఇవ్వడంపై సమర్థించుకోలేక దాటవేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవులుగా మతం మార్చుకుంటే వారిని ఎస్.సి లు గా గుర్తించకూడదని ఉన్న సమాచారాన్ని ఆ అధికారిని అడగ్గా తనకు తెలియదంటూ దాటవేశారు. అస్పష్ట, అసమగ్ర సమాచారం ఇచ్చిన ఆర్.టి.ఐ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. అచ్చంపేట మండల అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ఫోరమ్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.

ఎస్.సి లను క్రైస్తవులుగా మార్చివేసి వారికి అవే రిజర్వేషన్లు కొనసాగేలా, మతమార్పిడులకు ప్రోత్సహించేలా కుట్ర ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే లాగా సాగుతున్న ఈ కుట్రలను ఆర్.టి.ఐ రూపంలో కానీ, ఇతరత్రా మార్గాల ద్వారా కానీ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి దుశ్చర్యలను సమాజం గుర్తించి ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





