ArticlesNews

లోక కళ్యాణం నారద భక్తి సూత్రం

287views

( జేష్ట కృష్ణ ద్వితీయ – నారద జయంతి )

నారద ముని ఆబాల గోపాలానికి తెలిసిన మునిపుంగవుడు. “నారాయణ, నారాయణ” అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. నారద ముని ప్రస్తావన లేని భారతీయ వాఙ్మయం లేదు. నారదుడు దాసీపుత్రుడిగా జన్మించి ఐదేళ్ల చిరుప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి మునుల సేవలో జ్ఞానార్థిగా ఎదిగిన సామాన్య మానవుడు. హరినామ సాధన అవిరళంగా చేసి అఖండ భక్తితో విద్వత్తు పొందినవాడు. ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన నారద మునీశ్వరులు అంతటితో తృప్తి చెందిన తనలా ప్రతి సామాన్యుడు ఆ ముక్తి మార్గాన్ని అందుకోవాలనే సదాశయంతో “భక్తి సూత్రాలు” ప్రకటించారు. అవే నారద భక్తి సూత్రాలుగా జగద్విఖ్యాతం అయ్యాయి. 84 సూత్రాలతో కూడిన నారద భక్తి సూత్రాలలో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలను పొందుపరిచారు.

నారద మహర్షి నాద సాధకులకూ మార్గాన్ని చూపిన మహతీ నినాదుడు. స్వయంగా సరస్వతీ అమ్మవారు సంగీత విద్యను ఆయనకు బోధించారు. నారద మహర్షి తన గాత్రాన్ని మహతితో అనుసంధానం చేసి నాదాన్ని సప్తస్వర భాగాలు చేశారు. శబ్ద సంగీత విశేషమైన ఆహత, అనాహత గాన సూత్రాలు ఆయన ఆవిష్కరించినవే. నారదులవారు బ్రహ్మ సన్నిధిలో స్థాయి, సంచారి, ఆరోహణ, అవరోహణ రూపాలతో వాది, సంవాది పాద భేదములు కలిగిన సనాతన భారతీయ సంగీతం అందించారు. ధర్మ శాస్త్రం పై నారద విరచిత నారద స్మృతి ఈనాటికీ న్యాయ వ్యవస్థలో అమలులో ఉంది. బృహన్నారదీయము, లఘునారదీయము ఆంగ్లభాషలో కూడా అనువదించబడ్డాయి. శిల్పశాస్త్రంపై కూడా నారదులవారు గ్రంథ రచన చేశారు. అలాగే, మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం

నారదులవారి గ్రంథాల వైవిధ్యాన్ని గమనిస్తే నారద మహర్షికి ఈ లోకంలో మనుష్యులకు అవసరమైనవీ, అలాగే ఆధ్యాత్మిక లోకసాధన సంపత్తీ అన్నిటిపై పూర్తి అవగాహన ఉందని అర్థమవుతుంది. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు. అవసరం అనుకుంటే కలహాలు సైతం సృష్టించాడు. అయితే ఎన్ని కలహాలు సృష్టించినప్పటికినీ ఆయన ధ్యేయం ధర్మ రక్షణే, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణే. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా అతడికి శిక్ష పడేటట్లు చేయడమే ఆయన అంతిమ లక్ష్యం. అందుకే, నారదుని జన్మ తిథి అయిన జ్యేష్ఠ కృష్ణ ద్వితీయ నాడు ఆయన జయంతినే కాకుండా పాత్రికేయ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మొదటి ఆదర్శ పాత్రికేయుడైన నారదుని జయంతిని ఈ సంవత్సరం మే 14న జరుపుకుంటున్నాము.

నారద జయంతిని విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు విష్ణు భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రమైన నదీ స్నానం చేసి శుచియై నారద మహర్షి గౌరవార్థం ఉపవాసం ఉంటారు. నారద మహర్షి పూజా సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి తులసి, మందార పూలతో పూజించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. నారద జయంతి నాడు ఆయన్ను స్మరిస్తూ వీణను దానం చేస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణుడికి వేణువు కూడా భక్తితో సమర్పించడం ఆనవాయితీ. ఎంతో విశిష్టమైన నారదమునిని ఆయన జయంతి నాడు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. లౌకిక, అలౌకిక జ్ఞాన సముపార్జనకు ఆయన చూపించిన దారిలో అడుగులు వేసి లోక కళ్యాణానికి కృషి చేద్దాం.