News

చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు

387views

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం చిత్తూరు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబం తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి.. వేడుకలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు .. సీకే బాబు దంపతులతో కలిసి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర వేడుకల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తజనం పోటెత్తారు. జాతర మంగళ, బుధవారం రెండు రోజులపాటు కొనసాగనుంది. స్థానిక వాసులే కాకుండా సమీప పొరుగు రాష్ట్రలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

జాతరకు సర్వం సిద్ధం…
చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు ధర్మకర్తలు సీకే బాబు, హేమంత్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం వేకువ జాము నాలుగు గంటలకు వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు దంపతులు అమ్మవారికి తొలిపూజ చేసి, అంబలి నైవేద్యం సమర్పించారు. రాత్రి మహా కుంభనైవేధ్యం సమర్పించి, బుధవారం సాయంత్రం అమ్మవారిని జలప్రవేశం చేస్తారు. పోలీసులు, నగరపాలక, వైద్య సిబ్బంది సహకారంతో భద్రత, పారిశుధ్య, వైద్యసాయంపై ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు పలుచోట్ల దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జైన్‌ సంఘం ఆధ్వర్యంలో రెండు లక్షల మంది భక్తులకు మజ్జిగ, తాగునీరు, పళ్లరసాలు వితరణకు ఏర్పాట్లు చేశారు.

జాతరపై నిఘా…
చిత్తూరులో జరిగే గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అదే స్థాయిలో జేబు దొంగలు కూడా ఉంటారు. జాతర నిర్వహించే బజారువీధి, కొంగారెడ్డిపల్లె, మురకంబట్టు, గిరింపేట, తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. అక్కడ 24 గంటలపాటు సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. చిన్న సంఘటన జరిగినా పోలీసులు రంగంలోకి దిగుతారు.