
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన ఆయన శుక్రవారం తన చివరి పనిదినం పూర్తి చేసుకున్నారు. 2018 అక్టోబర్ 3న 46వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గొగొయి మొత్తం 13 నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. తన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెలువరించారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అయోధ్య వివాదానికి ముగింపు పలికిన రాజ్యాంగ ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ప్రవేశానికి సంబంధించిన కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించిన బెంచ్‌కూ ఆయనే నేతృత్వం వహించారు. అలాగే రఫేల్ వ్యవహారలో క్లీన్ చిట్, రాహుల్ గాంధీని కేసులో హెచ్చరించి వదిలేయడం , సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకే వస్తుందంటూ పలు తీర్పులు వెలువరించారు. గత సీజేఐ పనితీరును తప్పుబడుతూ న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చిన బృందంలోనూ ఆయన ఒకరు కావడం గమనార్హం.
సోమవారం కొత్త సీజేఐ బాధ్యతలు
సీజేఐగా జస్టి్‌స్ రంజన్ గొగొయి పదవీవిరమణ చేసిన నేపథ్యంలో తదుపరి ఆయన వారసుడిగా, 47వ సీజేఐగా జస్టిస్ బోబ్డే (63) ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనను తదుపరి సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఆయన పదవిలో ఉండనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బోబ్డే.. అయోధ్య తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.#SUPREME COURT
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





