
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆమేరకు రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రేలిస్టులోకి పాకిస్థాన్‌ను తీసుకువచ్చేలా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్‌కు అందే 7 బిలియన్ డాలర్ల సాయంపై ఆందోళనలు వ్యక్తంచేయనుంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్‌కు శరాఘాతమే
అసలు ఎఫ్‌ఏటీఎఫ్ అంటే ఏమిటీ..?
అక్రమ మార్గాల్లో వచ్చే నగదు చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతం ఇస్తాయి. చాలా వెనకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చేవిధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం కాదు. పారిస్ కేంద్రంగా జీ-7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీనిని ప్రారంభించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. జీ7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) విధి. ఇక, ఎఫ్‌ఏటీఎఫ్ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉండటం ఇస్లామాబాద్‌కు కొత్తేమీ కాదు. నిషేధిత జాబితా (బ్లాక్ లిస్ట్)లో ప్రవేశిస్తే పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంస్థ నుంచి వచ్చే రుణాలూ కష్టతరం కానున్నాయి.
ఆర్థికంగా దివాలా తీసి ఐఎంఎఫ్ రుణం కోసం దేహీ అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్థాన్ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించిన ఏడు బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీపై భారతదేశం ఆందోళనలను లేవనెత్తుతుందని భావిస్తున్నారు. మూడేళ్ల కాలానికి ప్యాకేజీ కోసం గత ఏడాది జులైలో ఐఎంఎఫ్-పాక్‌ల మధ్య ఒప్పందం ఖరారైంది.




