News

మరో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

590views

సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగకరం కాదని ప్రకటించింది. గోప్యత హక్కు, సమాచార హక్కు అనేవి కలిసిమెలిసి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థపై పరిశీలనకు ఆర్టీఐ ఒక సాధనంగా ఉండాలని పేర్కొంది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు దిల్లీ హైకోర్టు తీర్పునే సమర్థించడం గమనార్హం.

ఆర్‌టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగా.. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన అప్పీళ్లను తోసిపుచ్చింది. అయితే, ఆర్టీఐని నిఘా అస్త్రంగా వినియోగించరాదని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దృష్టిలో ఉంచుకుని దీన్ని వినియోగించాలని ధర్మాసనం సూచించింది. అంతేకాకుండా కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే ఆర్టీఐ కింద ఇవ్వడం జరుగుతుందని, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించేది లేదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.