
పహల్గాం ఉగ్రదాడి విషయంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కోణం బయటపడింది.
పహల్గాం ఉగ్రదాడి వెనుక చైనా ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు చైనాకు చెందిన ఫోన్లు, ఇతర సామాగ్రిని వాడినట్లు నిఘా వర్గాలు తేల్చేశాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్స్ ద్వారానే కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. ఈ మేరకు పహల్గాంలో ముష్కరులు కాల్పులు జరిపిన చోట చైనీస్ శాటిలైట్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో చైనా సాయంతోనే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిపినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు భారత్- పాకిస్థాన్ వివాదంలో నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దర్ చైనాకు చెందిన తన కౌంటర్‌పార్ట్ వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య టెలిఫోన్ సంభాషణలు సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలను వాంగ్ యీతో చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో భారత్ కు భయపడి పాకిస్తాన్ అండకోసం చైనా వద్దకు వెళ్తోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు బాధిత దేశమైన భారత్‌కు మద్దతుగా నిలుస్తుంటే, చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుట్రదారు పాక్‌కు వత్తాసు పలుకుతోంది. తాజాగా తమ మిత్రరాజ్యమైన పాకిస్థాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బహిరంగ పరచుకుంది.
అలాగే పహల్గాం ఉగ్రదాడిపై ‘త్వరగా, న్యాయమైన దర్యాప్తు’ చేయాలని చైనా వ్యాఖ్యానించింది. ‘చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం పాకిస్థాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్‌ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల గురించి వాంగ్ యికు ఇషాక్ దార్ వివరించినట్లు’ చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
భారత్, పాక్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, జరుగుతున్న పరిణామాలను చైనా నిశితంగా గమనిస్తోందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని వాంగ్ పేర్కొన్నారు. కానీ వెంటనే చైనా వక్రబుద్ధిని స్పష్టంగా బయటపెట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ చైనా మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.
“చైనా మిత్రదేశం, వ్యూహాత్మక సహకార భాగస్వామి అయిన పాకిస్థాన్ భద్రతా ఆందోళనలను మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. పాక్ తన సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి మా పూర్తి మద్దతు ఇస్తాం. పహల్గాం ఉగ్రదాడి విషయంలో త్వరగా, న్యాయమైన దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాం” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు.
ఈ వివాదం భారత్, పాక్‌ల ప్రాథమిక ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. అంతేకాదు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కనుక ఇరుదేశాలు సంయమనం పాటించాలి. ఇరు పక్షాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పరం ముందుకు రావాలి” అంటూ హితవు చెప్పారు.
వాస్తవానికి ఈ ఉగ్రదాడి జరగగానే చైనా తీవ్రంగా ఖండించింది. “పహల్గాం దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సంతాపం తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు.
భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా ఈ ఉగ్రదాడిని ఖండించారు. “పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిని మేము ఖండిస్తున్నాం. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం” అని జు ఫీహాంగ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి పాక్‌కు మద్దతుగా మాట్లాడడం గమనార్హం.





