News

దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు తీయాలి : నడింపల్లి ఆయుష్

430views

భారతీ ఫిల్మ్ సొసైటీ భాగ్యనగర్ ఆధ్వర్యంలో భారతీయ చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జన్మదినోత్సవ సభ శోభాయమానముగా జరిగింది. భాగ్యనగరంలోని ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు చలన చిత్ర దర్శక సంఘం అద్యక్షులు ప్రఖ్యాత దర్శకుడు శ్రీ వీర శంకర్ బైరిశెట్టి గారు మాట్లాడుతూ ఇలా దాదాసాహేబ్ ఫాల్కే జన్మదినోత్సవం జరపడం నిజంగా ముదావహం అనీ ఇలాంటి కార్యక్రమాలు భారతీ ఫిల్మ్ సొసైటీ సభ్యుల నిబద్ధత ను సూచిస్తుందనీ అన్నారు. చలనచిత్ర రంగంలో అన్ని రంగాలవారూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. అలాగే పాఠశాల స్థాయి లో ఫిల్మ్ అప్రిసియేషన్ వంటి కోర్సులు పెట్టాలని తద్వారా మంచి సినిమా లు వస్తాయని అభిప్రాయపడ్డారు. సంస్థ సభ్యుల ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి ముఖ్య వక్తగా తమ సందేశాన్ని అందించారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ వారు సినిమా చూడగానే ఆయన భారతీయ ఆత్మ పురాణాలను చలన చిత్రాలుగా తీయాలని పరితపించిందనీ, అందుకే రెండు మూడు రోజుల పాటూ ఆయన కంటి మీద కునుకు లేనంతగా చలనచిత్రం గురించే ఆలోచిస్తూ ఉండి పోయారనీ అన్నారు. ఇంగ్లాండ్‌లో సినిమాలు ఎలా షూటింగ్ చెయ్యాలో చక్కగా నేర్చుకున్నా, అక్కడ ఎక్కువ అవకాశాలు.. అంతులేని ఆదాయం ఉన్నా, మాతృభూమిపై ప్రేమ ఆయన బొంబాయి తిరిగి వచ్చేలా చేసిందని అన్నారు. ఫాల్కేను స్మరించుకున్న ప్రతిసారీ వారి శ్రీమతి సరస్వతి అమ్మను కూడా స్మరించుకోవాలనీ అన్నారు. ఆవిడ తన నగలను తాకట్టు పెట్టి ‘ రాజా సత్యహరిశ్చంద్ర’ సినిమాకు పెట్టుబడి సమకూర్చిందని గుర్తు చేశారు. ఇదే భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతిపాదించిన పంచపరివర్తన్‌లో కుటుంబ ప్రబోధన్ ప్రాముఖ్యత అని చెప్పారు.

తనని తాను అర్పించుకుని మరీ మొదటి చలనచిత్రం నిర్మించిన ఆ వైతాళికుడు దాదాసాహేబ్ ఫాల్కేను భారతీయ చలనచిత్ర రంగ పితామహునిగా మనం కొనియాడుతున్నామని ఆయుష్ గుర్తు చేశారు. తనని తాను అలా అర్పించుకునే విధానాన్ని ఈ దేశం ఎప్పుడూ పూజిస్తుంది. దాదాసాహేబ్ ఫాల్కే ఎలాగయితే పురాణ కధలను సినిమాలుగా తీశారో అలా ప్రస్తుత సినిమా ఔత్సాహికులు కూడా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కధలు తయారు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.. మన సంస్కృతి అంటేనే పర్యావరణ అనుకూల విధానం, మన సంప్రదాయాలు వసుధైక కుటుంబం అనే లక్ష్యంతో ఉంటాయని గుర్తు చేసుకోవాలన్నారు. ఇదే భారతీయ “స్వ” అన్నారు. పర్యావరణ సంరక్షణ మనకు తరతరాలుగా చెప్పబడిన విషయం అని అనేక శతాబ్దాలుగా భారతీయ GDP ప్రపంచంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉన్న సమయంలో కూడా మన వ్యాపార వాణిజ్యాలు పరిశ్రమలు కూడా పర్యావరణ రహితంగా ఉండేవని ముస్లిం ఆక్రమణదారులు పాశ్చాత్య ఆక్రమణదారులు వచ్చిన గత శతాబ్దాల లోనే మనకు కరువు వచ్చిందని ఆయుష్ జ్ఞాపకం చేశారు.

అలాగే పౌర బాధ్యతలు మనకు శిరోధార్యం కనుక మన చలనచిత్రాలు కూడా తదనుగుణంగా ఉండాలని, సమాజం పట్ల నిబద్ధతతో సినిమాలు రావాలని, దేశం పట్ల ప్రేమ అంటే సమాజం పట్ల ప్రేమ అన్నారు ఆయుష్. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణానికి ఎలా పనిచేస్తుందో అలాగే ఔత్సాహిక కళాకారులు దర్శకులు కూడా చక్కని కథలు కథనంతో మంచి సినిమాలు తీయాలని కోరారు. మరీ ముఖ్యంగా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌరనియమావళి, పర్యావరణ పరిరక్షణ వంటి పంచపరివర్తన అంశాలుగా సినిమా కుటుంబాలు నడవాలని ఆ ఆశయసిధ్ధి కోసం ఈ దాదాసాహేబ్ ఫాల్కే జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలనీ ఆయుష్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సునీల్ మహేశ్వరి, ప్రవీణ్ రామరాజు, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ గారు మొదలైన వారు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు, సంగీత నిపుణులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సీతారామరాజు రాజశేఖర్ గారి వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.