News

పీవోకేను స్వాధీనం చేసుకోవడమే పరిష్కారం.. భారత్‌కు బ్రిటిష్‌ ఎంపీ సూచన

273views

పహల్గాం ఉగ్రదాడిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్‌ కఠినంగా జవాబివ్వాలని కోరారు.

పీఓకే ఎప్పటికీ భారత్‌దే అని మేఘనాథ్ దేశాయ్ అన్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్‌ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని అన్నారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రధాని ఇప్పటికే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు.

ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు సహకరిస్తాం: బ్రిటన్‌
పహల్గాం ఉగ్రదాడి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని తాము భారత్‌ను కోరుతున్నట్లు బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనలో న్యూదిల్లీకి తాము ఎప్పటికీ అండగా ఉంటామని తెలిపింది. పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా ఇటీవల లండన్‌లో భారతీయులు నిరసన చేపడుతున్న సమయంలో అక్కడి పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారి వారిని బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియో తమను ఆందోళనకు గురి చేసిందని తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. ఇరుదేశాలతో తమకు సత్సంబంధాలు ఉన్నందున వారి మధ్య ఉద్రిక్తతలు చెలరేగాలని తాము కోరుకోవట్లేదని పేర్కొంది. కశ్మీర్‌ ప్రజల నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకొని.. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడాన్ని భారత్‌-పాక్‌ తమ బాధ్యతగా భావించాలని సూచించింది.