News

రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు వద్దు: కేంద్రం

417views

రక్షణ బలగాల కదలికలు, ఆపరేషన్లను ప్రత్యక్షంగా ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా కవరేజీ దేశ శత్రువులకు ఉపయోగకరం కావచ్చని అభిప్రాయపడింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ వ్యవహారాలపై వార్తా కథనాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రక్షణ శాఖకు సంబంధించిన విషయాలు, ఇతర రక్షణ సంబంధమైన అంశాలపై వార్తా కథనాలు అందించే విషయంలో అన్ని రకాల మీడియా వేదికలు, వార్తా సంస్థలు, సోషల్‌ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార చట్టాలను తప్పనిసరిగా పాటించాలి’’ అని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ‘‘ముఖ్యంగా రక్షణ కార్యకలాపాలకు సంబంధించి, బలగాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష కథనాలు, దృశ్యాలు ప్రసారం వంటివి చేయకూడదు’’ అని స్పష్టంచేసింది.