
భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితోపాటు ఘోరీ, షహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధూ జలాలను నిలిపివేస్తే.. పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చామని.. భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
‘‘మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని (భారత్‌ను) లక్ష్యంగా చేసుకొంటాయి’’ అని అబ్బాసీ పేర్కొన్నారు.
పాకిస్థాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూదిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. రెండ్రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు. అంతేకాదు.. ఇబ్బందులు ఎదుర్కోవడానికి తామూ సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.





