
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న పవన్.. నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి.. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాశ్మీర్‌లో కిరాతకంగా తూటాలు పేలిస్తే, దేశ వ్యాప్తంగా మధుసూదనరావుకు నివాళులర్పించారన్నారు. ఈ సంఘటనను కుటుంబ సభ్యులు ఇంకా నమ్మలేకపోతున్నారని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు… ఆయన భార్య, పిల్లలు ఏం జరిగింది.. ఎలా జరిగిందో చెప్పారన్నారు. వాళ్లు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని మండిపడ్డారు. తాను మాట్లాడలేక పోతున్నానని. మంగళగిరిలో ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు. ఎంత శాడిస్టికల్‌గా, మెతడాలికల్‌గా, కోల్డ్ బ్లెడెడ్‌గా చంపేశారన్నారు. కాశ్మీర్ రెండేళ్లుగా ప్రశాంతంగా ఉందనే ఇంతటి దారుణానికి, కిరాతకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సమ్మర్‌లో షూటింగ్ కోసం కాశ్మీర్‌కు చాలా సార్లు వెళ్లానని.. అక్కడ పరిస్థితులు తనకు తెలుసన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.





