News

పహల్గామ్ కాల్పుల మృతుల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్

656views

పహల్గామ్‌ను సందర్శించే పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంపై దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ మారణకాండలో కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎడప్పల్లికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుడు ఎన్ రామచంద్రన్‌ సైతం మరణించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా ఉన్న స్వయంసేవకులను తీవ్రంగా కలిచివేసింది. కర్ణాటకు చెందిన మంజునాథ్ రావును ఏ విధంగా అయితే తన భార్య కళ్ల ఎదుటే ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారో అదే విధంగా రామచంద్రన్‌ను సైతం అతని కూతురి కళ్లెదుటే ముష్కరులు కాల్చి చంపారు.

రామచంద్రన్‌ 1977 నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవక్‌గా పని చేస్తున్నారు. కొచ్చి మహానగర్ జిల్లాలోని ఎడప్పల్లి శాఖకు ఆయన ముఖ్య శిక్షక్‌గా సైతం బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1991లో బిజెపి అభ్యర్థిగా జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఎన్ రామచంద్రన్ మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆయన స్వస్థలానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు చంగంపుజ పార్క్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఎడప్పల్లిలో అంత్యక్రియలను నిర్వహించారు. అంతటి తీవ్ర దుఃఖ సమయంలో కూడా, రామచంద్రన్ భార్య షీలా ఒక గొప్ప కోరికను వ్యక్తం చేశారు: “పరమ పవిత్రమతమీ మన్నిల్ భారతంబయే పూజికన్” అనే దేశభక్తి గణగీతం ఆయన అంతిమ సంస్కారాల సమయంలో పాడాలని కోరి ఆ గీతాన్ని పాడించారు. షీలా అభ్యర్థన కేవలం ఆచారబద్ధమైనదే కాక, దేశం పట్ల రామచంద్రన్ జీవితాంతం చూపిన నిబద్ధతకు పరమ పవిత్రమతమీ గణగీతం ఆయనకు హృదయపూర్వక నివాళి అని స్థానికులు ప్రశంసించడం విశేషం.