
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల దాడిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఖండించింది. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్.ఎస్.ఎస్. సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారికి దత్తాత్రేయ హోసబలే నివాళులర్పించడమే కాక గాయపడినవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆయన దేశ ఐక్యత మరియు సమగ్రతపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మరియు సంస్థలు తమ విభేదాలకు అతీతంగా మూకుమ్మడిగా ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్.ఎస్.ఎస్. ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. అలాగే, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను ప్రభుత్వం అందించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కోరింది. దాడికి కారణమైన వారిని గుర్తించి తగ్గు విధంగా శిక్ష పడేలా చూడాలని తెలిపింది.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. ఉగ్ర మూక దాడిలో మృతి చెందినవారిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలంగాణలో ఐబీ ఆఫీసర్‌గా పని చేస్తున్న మనీష్ రంజన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌లు ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలయ్యారు.





