News

మతం అడిగి మారణకాండ హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి

361views

రక్తపు మడుగులు, ఆ మడుగుల్లో అక్కడక్కడా మృతదేహాలు.. ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిచి, విషణ్ణ వదనంతో కూర్చున్నవారు కొందరు.. అయినవారిని తమ కళ్ల ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నవారు మరికొందరు. భయ్యా.. నా భర్తను కాపాడండి.. దయచేసి సాయం చేయండి, మమ్మల్ని రక్షించండి.. అని చేతులు జోడించి వేడుకుంటున్న వారు ఇంకొందరు.. హనీమూన్‌కు వచ్చి భర్తను కోల్పోయి రోదిస్తున్న నవ వధువు ఓ వైపు ఉంటే.. తండ్రి చావుని చూసి రోదిస్తున్న కుమార్తె మరో వైపు.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం రక్తధారలతో తడిచిన పచ్చికబయళ్లలో కనిపించిన హృదయ విదారక పరిస్థితి ఇది. ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు.. హిందువులు, మరీ ముఖ్యంగా పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. పేర్లు, మతం అడిగి.. ఖురాన్‌లోని సూక్తులు పలికించి.. మతాన్ని నిర్ధారించుకుని మరీ తలపై తుపాకీలు పెట్టి కాల్చిపారేశారు. ఇదంతా ఎందుకు జరిగిందో ? వారు చేసిన తప్పేంటో? ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు. ఇక, అయినవారిని కళ్ల ఎదుటే కోల్పోయిన వారి ఆవేదనలు హృదయాలను కలచి వేస్తుండగా.. అందాల కశ్మీరం రక్తకన్నీరు పెట్టింది.

జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువులే లక్ష్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ‘‘మీది ఏ మతం?’’ అని అడిగినట్లు ఓ మహిళ పేర్కొంది. ‘‘తాము భేల్ పూరీ తింటున్నాం. ఈ సమయంలో ఉగ్రవాది దగ్గరికి వచ్చి మీది ఏమతం? అని అడిగాడు. తాము హిందువులం అని చెప్పాం’’ అని మహిళ పేర్కొంది. ఈ సమాధానం తర్వాతే విచక్షణా రహితంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కారణంగానే హిందువులే లక్ష్యంగా ప్రణాళికలు రచించారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.