News

వక్ఫ్ ట్రస్టీలుగా నటించి వందల కోట్లు కొట్టేసిన ఐదుగురు అరెస్ట్

236views

‘వక్ఫ్’పేరిట ఇంతకాలం గుట్టుగా కొల్లగొట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో గుండెలదిరే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.’వక్ఫ్ ట్రస్ట్ భూమి’పై ట్రస్టీలుగా నటిస్తూ ఏకంగా 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, దుకాణాలపై అద్దె వసూలు చేసినందుకు ఐదుగుర్ని అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు. ఈ ఐదుగురు పేర్లు .. 1. సలీం ఖాన్ పఠాన్, 2.మహమ్మద్ యాసర్ షేక్, 3. మహమ్మద్ ఖాన్ పఠాన్, 4 ఫైజ్ మొహమ్మద్ చోబ్దార్, 5. షాహిద్ అహ్మద్ షేక్ వీరందర్నీ ఇవాళ కటకటాలవెనక్కి నెట్టారు పోలీసులు.

సలీం ఖాన్ అనే నకిలీ ట్రస్టీ సదరు భూమిలో పది దుకాణాలను నిర్మించాడు. వాటిలో ఒకదాన్ని నిందితుడు తన ఆఫీస్ పెట్టుకుని, మిగిలిన దుకాణాలను అద్దెకు ఇచ్చాడు. వీటిపై వచ్చే రెంట్స్‌ని 17 ఏళ్లుగా సొంతానికి అనుభవిస్తున్నాడు. పోలీసు నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని ‘వక్ఫ్ బోర్డు’ కింద నమోదైన అహ్మదాబాద్‌కు చెందిన రెండు ట్రస్టుల యాజమాన్యంలోని భూమిపై నిర్మించిన నిర్మాణాలకు ట్రస్టీలుగా నటిస్తూ 17 సంవత్సరాల నుంచి వీళ్లంతా అద్దె వసూలు చేసుకుంటూ దర్జాలు, దాదాగిరి చేస్తున్నారు.

అహ్మదాబాద్ నగరంలోని గైక్వాడ్ హవేలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR ప్రథమ సమాచార నివేదిక ప్రకారం, ‘కచ్ని మసీదు ట్రస్ట్’ ఇంకా ‘షా బడా కసమ్ ట్రస్ట్’కు చెందిన భూమిపై దాదాపు 100 ఇళ్ళు, దుకాణాల నుండి ఈ మోసగాళ్ళు అద్దె వసూలు చేశారు. వక్ఫ్ బోర్డు కింద నమోదు చేయబడిన ట్రస్టులకు చెందిన ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని దర్యాప్తులో తేలిన తర్వాత పోలీసులు వారిపై మోసం, ఇంకా నకిలీ పత్రాలు సృష్టించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ డిసిపి భరత్ రాథోడ్ అన్నారు. “నిందితులు రెండు ట్రస్టులకు చెందిన 5,000 చదరపు మీటర్లకు పైగా అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని. వాళ్లు 2008 – 2025 మధ్య దాదాపు 100 ఆస్తులను (ఇళ్ళు, దుకాణాలు) నిర్మించారని చెప్పారు. వీటిపై నెలవారీ అద్దెలు వసూలు చేశారని రాథోడ్ చెప్పారు. కాగా, ఇక ఈ దందాలో లీడ్ రోల్ ప్లే చేసిన సలీం ఖాన్ ఒక పేరు మోసిన రౌడీ షీటర్ అని తెలుస్తోంది. ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంతో ఇతనిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి.

ఈ వ్యవహారాన్నంతా బట్టబయలు చేసింది.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. మొహమ్మద్ రఫీక్ అన్సారీ అనే వ్యక్తి. ఇతను సదరు ఇళ్లలో అద్దెకు ఉండే వాడు. అతని మాటల ప్రకారం కచ్ని మసీదు ట్రస్ట్‌కు చెందిన భూమిలో కూడా అక్రమంగా నిర్మాణాలు జరిపి 17ఏళ్లుగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారని.. నిందితుల్లో ఎవరూ ఏ ట్రస్టులోనూ సభ్యులు కాదని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏళ్లకు ఏళ్లుగా వచ్చిన అద్దె డబ్బును తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడమే కాకుండా, షా బడా కాసి ట్రస్ట్ యొక్క విరాళాల పెట్టెలో సేకరించిన డబ్బును కూడా నిందితులు వాడుకున్నారని కూడా చెప్పుకొచ్చాడు. కాగా, నిందితులు కచ్ని మసీదు ట్రస్ట్‌కు చెందిన భూమిలో 15 దుకాణాలను నిర్మించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో, ఈ భూమిని ఉర్దూ పాఠశాల కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ -AMCకి అప్పగించారు.

అయితే, 2001 భూకంపం సమయంలో, పాఠశాల నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2009లో పాఠశాలను కూల్చివేసి సమీపంలోని ప్రాంతానికి మార్చింది. ఇంతలో, ఆ నకిలీ ట్రస్టీలు సదరు పాఠశాల స్థలంలో పది దుకాణాలను నిర్మించారు. ఇందులోని ఒకదాన్ని నిందితుడు సలీం ఖాన్ తన కార్యాలయం పెట్టుకున్నాడు. మిగిలిన వాటిని అద్దెకు ఇచ్చాడని ఫిర్యాదుదారుడు పోలీసులకు పూర్తి వివరాలతో సహా సమాచారం ఇచ్చాడు. నిందితులు వసూలు చేసిన అద్దెలను ఏనాడూ ట్రస్ట్ ఖాతాలో జమ చేయలేదని లేదా AMCకి అప్పగించలేదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఈ విధంగా, ఈ ఐదుగురు AMC, ఇంకా ‘వక్ఫ్ బోర్డు’ని మోసం చేశారని రఫీక్ అన్సారీ చెప్పాడు.