
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది. అలాగే, పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారినప్పుడు ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో తమ వాటాగా రావాల్సిన 4.3 బిలియన్ డాలర్లు చెల్లించాలన్నారు. అయితే, ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ పద్మలో జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్, పాక్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు. ఇక, ఈ నెల 27, 28 తేదీల్లో బంగ్లాదేశ్ పర్యటనకు పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ వెళ్లడానికి ముందు చర్చలు జరగడం గమనార్హం.
ఇక, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్ మాట్లాడుతూ.. 1971 యుద్ధ సమయంలో పాక్ సైన్యం చేసిన ఊచకోతకు పాల్పడినందుకు బహిరంగ క్షమాపణతో పాటు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న పాకిస్తానీయుల పునరుద్ధరణ, పాక్‌లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల పంపకం, 1970 తుఫాన్ బాధితులకు ఇచ్చిన విదేశీ ఆర్థిక సహాయం బదిలీ లాంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ సమస్యలు పరిష్కారమైతే, ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు పునాదిని వేసుకోవచ్చు అన్నారు. అయితే, ఈ విషయంలో పాకిస్థాన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు ఉద్దీన్ పేర్కొన్నారు.





