News

ప్రవేశ పరీక్షలో ‘జంధ్యం’ వివాదం.. అధికారులపై కేసు, హోంగార్డుల సస్పెన్షన్‌!

326views

కర్ణాటకలో వృత్తి విద్య కళాశాలల్లో చేరేందుకు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు రాయడానికి వచ్చిన కొందరు విద్యార్థుల మెడలోని జంధ్యాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆదిచుంచనగిరి పీయూ కాలేజీ అధికారులపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు శివమొగ్గలోని ఓ పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తించిన ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

శివమొగ్గలోని ఆదిచుంచనగిరి పీయూ కాలేజీ కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులను తనిఖీ చేసిన అధికారులు ముగ్గురు విద్యార్థులను జంధ్యాన్ని తీసివేయాలని సూచించారు. ఓ విద్యార్థి జంధ్యం తీయడం ఇష్టంలేక వెనక్కు వెళ్లిపోగా.. దాన్ని తొలగించిన ఇద్దరిని పరీక్షకు అనుమతించినట్లు తెలిసింది. బీదర్‌లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనలపై బ్రాహ్మణ మహాసభ, భాజపాలు భగ్గుమన్నాయి. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సూచనల మేరకు ఇద్దరు హోంగార్డులను సస్పెండ్‌ చేస్తూ శివమొగ్గ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సి ఉందని జిల్లా పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సెట్‌ నిర్వహణ విభాగానికి నివేదికను అందించినట్లు సమాచారం.

ఖండించిన కేంద్ర మంత్రి..
విద్యార్థుల జంధ్యం తొలగించిన ఘటనను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఖండించారు. రాష్ట్రంలో నకిలీ సెక్యులర్‌ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సంబంధిత అధికార యంత్రాంగం విచారం వ్యక్తం చేసినప్పటికీ.. పరీక్ష రాయని విద్యార్థులకు పరిష్కారం చూపాలన్నారు.