
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. టిటిడి పాలక మండలి సమావేశ తీర్మానాల మేరకు గతంలో 47 మంది అన్యమతస్థులను గుర్తించారు. వీరికి దేవస్థానంలోని కీలక విభాగాలు ఆధ్యాత్మిక, ధార్మిక, విద్యా క్షేత్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత టిటిడి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ శుక్రవారం టిటిడి విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన వారికి కూడా త్వరలో బదిలీలు ఉండే అవకాశం ఉంది.
టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది. ఇప్పటికే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.