
కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్ విషయంలో మా వైఖరి సరైనది. ఆ ప్రాంతం మా జీవనాడి. దానిని మేం మర్చిపోలేం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే భారత్ స్పందన వచ్చింది. ఈ అంశంలో మనదేశం ఎప్పటికప్పుడు తన వైఖరిని బలంగా వినిస్తోంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పొరుగుదేశం అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడిపిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌కు పీవోకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని సాగిస్తోందన్నారు. ఇటీవల ఐరాస వేదికగా భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరుగుతున్న చర్చల్లో జమ్మూకశ్మీర్‌పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి న్యూదిల్లీ గట్టిగా చురకలంటించింది.
‘‘భారత కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇలా పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉంది. దాన్ని ఖాళీ చేయాల్సిందే’’ అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ హితవు పలికారు.
ఆ అపఖ్యాతి పాక్ సొంతం..
‘‘ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాకిస్థాన్ గడించిన ఖ్యాతి.. ఆ దేశం ఎంత ప్రయత్నించినా పోదు. ఉగ్రదాడులకు పాల్పడినవారిని ఆ దేశం ఇప్పటికీ కాపాడుతోంది. ముంబయి ఉగ్రదాడుల కుట్రదారు తహవ్వుర్ రాణా అప్పగింత ఆ విషయాన్ని పాక్‌కు గుర్తుచేస్తుంది’’ అని అని జైస్వాల్ అన్నారు. అలాగే ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi)ని బెల్జియం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘‘మన అప్పగింత అభ్యర్థన మేరకు ఛోక్సీ అరెస్టయ్యారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే విషయంలో బెల్జియం ప్రభుత్వంతో కలిసిపనిచేస్తున్నాం’’ అని తెలిపారు.





