News

పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట..

330views

అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ పేరు చెప్పి, భారత్‌ను నిందలపాలు చేయాలని పాకులాడి బోర్లా పడుతున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్‌ మునీర్ మళ్లీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. అది తమ జీవనాడి అని, దానిని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు.

ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. ‘‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు పాక్‌ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది’’ అని మాట్లాడారు.

‘‘ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్థాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..?’’అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు బలోచిస్థాన్‌ గర్వకారణమన్నారు. అలాగే కశ్మీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం’’ అంటూ బీరాలు పలికారు.