ArticlesNews

సేవలోనే ఆధ్యాత్మికత..

313views

ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు వైద్య సౌకర్యం అంతగా ఉండదు. ఎంత పెద్ద అనారోగ్యమైనా పసరు మందులపై ఆధారపడే పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన ఆధ్యాత్మిక సంస్థ రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో దాదాపుగా 40 ఏళ్లకు పైగా గిరిజనులకు ఉచిత వైద్యం అందిస్తోంది. గోదావరి తీరంలో పేరున్న వైద్యులు.. స్వామీజీల సేవలకు తమవంతు కృషి చేస్తూ సహకారం అందిస్తున్నారు. మరోవైపు పిల్లలు, యువతకు భవిత నిర్మాణంలో సహాయకారులుగా నిలుస్తున్నారు.

రాజమహేంద్రవరం నగరంలోని గోదావరి తీరాన 1972లో రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం పేరుతో హోమియోపతి ఆసుపత్రి ప్రారంభించారు. 1992లో అల్లోపతి విభాగం ప్రారంభించి ధర్మవైద్యశాల పేరుతో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యశాల నిర్వహిస్తూ నిపుణులైన వైద్యబృందం సహకారంతో సేవలందిస్తున్నారు. పేథాలజీ లేబొరేటరీ, ఎక్స్‌రే యూనిట్, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్, ఎండోస్కోపి, ఈసీజీ, ఫిజియో థెరపీ యూనిట్, వ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

పూర్తిగా ఉచితం
ధర్మ వైద్యశాలకు దూరప్రాంతాల నుంచి వచ్చేవారిలో గిరిజనులు ఎక్కువగా ఉండడం గమనించిన మఠం స్వామీజీలు వారి చెంతకే ఆసుపత్రి సేవలందించాలనే ఆశయంతో 1984లో ఉచిత గిరిజన సంచార వైద్యశాల పేరుతో వాహనం ద్వారా నిపుణులైన వైద్య బృందంతో కలిసి సేవలు అందించేవారు. తర్వాత రంపచోడవరం కేంద్రంగా ఆసుపత్రికి సొంత భవనం ఏర్పాటు చేసుకుని ప్రతి ఆదివారం ఉచిత వైద్యసేవ నిర్వహిస్తున్నారు. వీరిలో అవసరమైన వారికి రాజమహేంద్రవరం వైద్యశాలకు రప్పించి పూర్తిస్థాయిలో ఆపరేషన్‌ లేదా ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నెలకు రెండు పర్యాయాలు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు, మందులు ఇస్తారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం అందిస్తారు.

సమాజ హితం కోసం..
ఏటా శీతాకాలంలో గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆయా గ్రామాలకు వెళ్లి రగ్గులు పంపిణీ చేస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో దుస్తులు, నిత్యావసరాలు, వైద్య సాయం అందిస్తారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని రామకృష్ణ మఠంలో 2008నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలలకు ‘వివేకానంద అభ్యుదయ ప్రకల్ప’ భావిభారతం పేరుతో సాయంత్రం సమయంలో ఉచిత శిక్షణ అందిస్తారు. ఇందులో భాగంగా 5 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు పాఠ్యాంశాల్లో లెక్కలు, ఆంగ్లం, ఇతర అంశాల్లో శిక్షణ అందిస్తారు. స్వామీజీలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ అందిస్తారు. నిరుపేద యువతకు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ, ఆంగ్ల భాషా నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ యువతకు మార్గదర్శనం చేస్తున్నారు.

స్వామి వివేకానంద బాటలో..
స్వామి వివేకానంద భారతదేశాన్ని అగ్రపథంలో చూడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు ఉండాలని కోరుకున్నారు. ఆయన బాటలో సాగుతూ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.-స్వామి పరిజ్జేయానంద మహరాజ్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు