News

రాష్ట్ర సేవికాసమితి ఆధ్వర్యంలో కర్నూలులో పథ సంచలన్

527views

రాష్ట్ర సేవికాసమితి కర్నూలు విభాగ్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటెస్సోరి పాఠశాలలో నిర్వహించారు.

రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర వీధుల గుండా పథ సంచలన్ కార్యక్రమం విద్యానగర్ మాంటిస్సోరి స్కూల్ నుంచి ప్రారంభమై రాజవిహార్ సర్కిల్, మౌర్య ఎన్ కూడలి, ఫైరోట్ జంక్షన్, ఎస్సీ కాంప్లెక్స్ మీదుగా గాంధీనగర్ నుండి మాంటిసోరి స్కూలు వరకు సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన సమితి ప్రాంత సహకార్యవాహిక శ్రీమతి ఉజ్వల మాట్లాడుతూ భారతీయ మహిళల్లో నిద్రాణమై ఉన్న దేశభక్తిని తిరిగి జాగృతం చేసే పనిని సమితి స్వీకరించిందని ఈ కార్యంలో 90 సంవత్సరాలుగా నిరంతరం పనిచేస్తున్నదని తెలియజేశారు. శ్రీరాముడు నిర్వహించిన ధర్మ రక్షణ కార్యక్రమానికి వెన్నుదన్నుగా కౌసల్య సీత అందించిన సహకారమే మూలమని పాండవుల ధర్మపోరాటానికి ద్రౌపది అండగా నిలిచిందని పురుషుడు యొక్క విజయానికి స్త్రీ యొక్క అండదండలు అవసరమని దానికి తగినట్లుగా మహిళలు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు గృహ విధులను సమర్ధంగా నిర్వహించుకుంటూనే సమాజ రక్షణ, దేశ రక్షణ, స్వీయ రక్షణతో పాటు నేటి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా తయారవ్వాలని అందుకు రాష్ట్ర సేవిక సమితి మహిళలకు శిక్షణతో పాటు శారీరక మానసిక వికాసానికి తగిన శిక్షణ అందిస్తూ గత 90 సంవత్సరాలుగా కృషి చేస్తున్నదని తెలిపారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి స్వర్ణలత గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో హిందూ కుటుంబాలలో ముఖ్యంగా పిల్లలు తమ సంస్కృతి సంప్రదాయాలను విస్మరించారని కట్టుబొట్టు అన్ని మర్చిపోయారని వీటిని సంస్కరించాలంటే అది కేవలం తల్లి వల్లనే సాధ్యం అని చెప్పారు. కాబట్టి తల్లులు ఈ బాధ్యతను స్వీకరించాలని తమ పిల్లలను సంస్కారవంతులుగా సంస్కృతి సాంప్రదాయ ధర్మ రక్షకులుగా తయారు చేయాలని రాష్ట్ర సేవికాసమితి ఇలాంటి సంస్కారాలను ఇవ్వడం చాలా సంతోషదాయకమని చెప్పారు.

కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నుండి పూర్ణ గణవేష్ ధారి సేవికలు 215 మంది పాల్గొన్నారు. ఇతర అతిథులు 250 మంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికాసమితి కర్నూలు విభాగ కార్యవాహిక మానినీయ జి.ఎన్ విశాలాక్షమ్మ గారు, రాష్ట్ర సేవిక సమితి కర్నూల్ జిల్లా కార్యవాహిక మా అన్నయ్య జి వసంత లక్ష్మి గారు పాల్గొన్నారు.