News

వక్ఫ్‌ బోర్డులను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు: నడ్డా

210views

వక్ఫ్‌ బోర్డులను నియంత్రించాలన్నది తమ అభిమతం కాదని, అవి చట్టం పరిధిలో పనిచేసేలా చూడటమే తమ ప్రాధాన్య అంశమని భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. వక్ఫ్‌ ఆస్తులు ముస్లింల విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడేలా చూస్తామని తెలిపారు. భాజపా 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రోజు లోక్‌సభలో మన పార్టీ సభ్యుల సంఖ్య 240, రాజ్యసభలో 98. అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కలిపి సుమారు 1,600 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం మన పార్టీలో సభ్యత్వం తీసుకున్నవారి సంఖ్య 13.5 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా క్రియాశీల కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారు’’ అని నడ్డా పేర్కొన్నారు.

‘‘పార్టీని విస్తరించడం, ఎప్పటికప్పుడు ఎన్నికల్లో గెలవడం ఒక కళ, ఒక సైన్స్‌. మనపై విమర్శనాస్త్రాలు సంధించే ప్రత్యర్థులు కూడా ప్రపంచంలో భాజపానే పెద్ద పార్టీ అని అంగీకరిస్తారు. భాజపాకు ఎప్పుడూ దేశమే ప్రధానం. మన సంస్కృతి, కళలు, చరిత్రను ప్రచారం చేస్తూనే ఉంటాం. పార్టీ అధికారంలో ఉండగానే అయోధ్యలో రామాలయం నిర్మితం కావడం గర్వకారణం’’ అని నడ్డా అన్నారు. షాబానో కేసును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలే చేస్తుందని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఆ పార్టీ ఎలా దెబ్బతీసిందో ప్రజలకు చెప్పాలని, అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి 25 వరకు ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు నడ్డా సూచించారు.