News

“జలియన్‌వాలా బాగ్” కు.. బ్రిటన్ భారత్‌కి క్షమాపణ చెప్పాల్సిందే..

484views

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం “జలియన్ వాలాబాగ్” మారణహోమం. బ్రిటీష్ వాడి వలస చరిత్రపై సిగ్గుపడే గుర్తుగా మిగిలింది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి 106 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇది యూకే పార్లమెంట్ ని కుదిపేస్తోంది. ఇటీవల, బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ప్రభుత్వం ఈ దారుణంపై అధికారికంగా భారతదేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వలసవాద అణచివేతలో అత్యంత క్రూరమైన చర్యలలో శాశ్వత మచ్చగా మిగిలిందని ఆయన అన్నారు.

ఆయన యూకే పార్లమెంట్లో ఏప్రిల్ 13, 1919 నాటి విషాద సంఘటనపై మాట్లాడారు. జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన ఈ ఘటన వేలాది మంది పౌరులు మరణించేలా, గాయపడేలా చేసింది. ఈ చీకటి అధ్యాయాన్ని బ్రిటిష్ చరిత్రలో ఒక మరకగా అభివర్ణించారు. బ్లాక్ మన్ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని వివరిస్తూ…” ప్రజలు జలియన్ వాలాబాగ్ ఎండలో శాంతియుతంగా సమావేశమయ్యారు. అయితే, బ్రిటిష్ దళాలు ఆ ప్రాంతంలో నిరాయుధులైన వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఉచకోత ముగిసే సమయానికి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది గాయపడ్డారు” అని అన్నారు.

2019లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే ఊచకోతను అంగీకరించారని, కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదని బ్లాక్మన్ ప్రస్తావించారు. ఆమె ఈ ఘటనకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ఈ ఘటనపై భారత ప్రజలకు అధికారికంగా బ్రిటన్ పార్లమెంట్ క్షమాపణ ప్రకటన జారీ చేయగలదా..? అని ప్రవ్నించారు. బ్లాక్మన్కి మద్దతుగా సభా నాయకురాలు లూసీ పావెల్ కూడా ఇది బ్రిటిష్ వలసపాలనలో సిగ్గుచేటు సంఘటన అని అన్నారు.