
తిరుపతి నుంచి తమిళనాడులోని పళనికి ఆర్టీసీ సర్వీసులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి, రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా పళని వెళ్లినప్పుడు అక్కడి నుంచి తిరుపతికి నేరుగా బస్ సదుపాయం లేదనే విషయాన్ని భక్తులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, రవాణా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా కొత్త బస్సులు నడిపేలా వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య బస్సు సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందని చెప్పారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఏపీఎస్‌ఎంఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.
తిరుపతి, పళనిలో రాత్రి 8 గంటలకు
కొత్తగా ఆరంభించిన ఈ రెండు బస్ సర్వీసులు.. 505 కి.మీ. దూరాన్ని 11 గంటల్లో చేరుకుంటాయి. రోజూ రాత్రి తిరుపతిలో 8 గంటలకు బయలుదేరే బస్సు మరుసటిరోజు ఉదయం 7 గంటలకు పళని చేరుకుంటుంది. పళనిలో రాత్రి 8 గంటలకు బయలుదేరే బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ.680, పిల్లలకు రూ.380గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.