ArticlesNews

ఉషస్సుల ఉగాది నవ్యతకు నాంది

300views

శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

ఉగాది అనే మాట యుగానికి వికృతి రూపమైన ఉగం నుంచి పుట్టింది. ఉగస్య ఆదిః ఉగాది- అన్నారు. ఉ అంటే నక్షత్రం, గ అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు కనుక ఉగాది అయ్యింది. సంవత్సరాది రోజున ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా.. ఎటువంటి వ్యక్తులతోనైనా సామరస్య ధోరణిలో మెలగాలని సూచించే షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరగిద్దాం. పంచాంగశ్రవణం విని అందుకు తగ్గట్టుగా ఏడాది ప్రణాళికను రచించుకుందాం. విశ్వావసు నామ సంవత్సరం సకలజనులకూ సర్వ శుభాలూ కలిగిస్తుందని ఆశిద్దాం.

బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి సంవత్సరం ప్రభవ, మొదటి రుతువు వసంతం, మొదటి మాసం చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. అదే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి, ఉగాది. శ్రీమహావిష్ణువు మత్స్యరూపుడై వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి వధించి, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినమూ ఉగాదే. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణయించిన శుభముహూర్తం, ద్వాపర యుగానంతరం కలియుగం మొదలైన పర్వదినం, శాలివాహనుడు శౌర్యపరాక్రమాలతో రాజ్యపాలన చేసి యుగకర్తగా శోభించేందుకు నిశ్చయించిన పట్టాభిషేక శుభతిథి కూడా ఇదే.

నవ్య శుభారంభం 

ఉగాది రోజున నూతన వస్త్రాలు ధరించడమే కాదు.. నగలు, గొడుగు, విసనకర్ర, పాత్రలు- ఇలా అన్నీ కొత్తవి తీసుకోవటం ఆనవాయితీ. కొత్త పాత్రలో ఉగాదిపచ్చడి, పిండివంటలు చేసుకుంటారు. ఈ ఉగాది పర్వదినాన ఏ పని మొదలుపెట్టినా అది ఫలవంతం అవుతుందని, తీసుకునే నిర్ణయాలు అనుకున్నవిధంగా నెరవేరతాయని విశ్వసిస్తారు..

కలశ దానం

కోయిలమ్మల కుహుకుహు రాగాలు, లేత చిగుళ్ల సొగసు, మల్లెపూల సౌరభాలు, మావిపూతల మధురిమలతో కనువిందు చేస్తుంది వసంతం. ఈ శుభ తరుణంలో ఇల్లిల్లూ మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తుంది. పంచపల్లవాలు పేర్చి, పుష్పాక్షతలు చేర్చిన పంచలోహ కలశాన్ని గుడిలో దానమివ్వాలి. పురోహితుడి ఆశీర్వాదంతో మనోరథాలన్నీ నెరవేరుతాయి. ఈ పూర్ణకుంభ పూజా విధానం ద్వారా ప్రకృతి ఆస్వాదన, ఆధ్యాత్మికత రెండూ అవగతమవుతాయి.

షడ్రుచుల సమ్మేళనం

ఉగాదిలో ముఖ్యమైంది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదుల కలయిక.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని బోధపరుస్తుంది. ఉగాది పచ్చడిలోని బెల్లం ఆనందానికి, పచ్చిమిరప కష్టానికి, వేపపువ్వు విషాదానికి, మామిడి మాధుర్యానికి, చింతపండు ఆరోగ్యానికి, ఉప్పు భయానికి ప్రతీకలు.
‘సర్వారిష్ఠ వినాశాయ, నింబకందళ భక్షణం’ అని పఠిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవించాలి. ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి. ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే గాక, వాతావరణ మార్పు వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుంది.

పంచాంగ శ్రవణం

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదింటితో కూడుకున్నదే పంచాంగం. ఉగాది నాటి ఆచారాల్లో పంచాంగ శ్రవణం ప్రత్యేకమైంది. ఇందులో కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరిస్తారు. సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు, లాభనష్టాలు, ఆదాయ కందాయ ఫలితాలు, వర్షపాత, పంటల వివరాలు, వ్యక్తుల జాతక ఫలితాలు.. ఒకటేమిటి అనేకానేక విషయాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తారు.
పంచాంగ శ్రవణం చేసినవారికీ, విన్నవారికీ నవగ్రహానుగ్రహం లభిస్తుంది. సూర్యుని వల్ల శౌర్యం, చంద్రుని వల్ల భాగ్యం, కుజుని వల్ల సకల శుభం, బుధుని వల్ల బుద్ధి వికాసం, గురుని వల్ల విద్య, శుక్రుని వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల కీర్తి, కేతువు వల్ల వంశ వృద్ధి అనేది ఫలశ్రుతి.

వసంతగానం

మావి చిగురు, కోయిల స్వరమాధుర్యం, ప్రకృతిశోభ- ఇలా ఉగాదికి సంబంధించిన ప్రతీ అంశం కవుల కలాలను కదిలించేదే. ఉగాదిని కవితా వస్తువుగా తీసుకోని కవులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఉగాది కవి సమ్మేళనాలు అంత ప్రసిద్ధి.
నూతన వస్త్రధారణ, వేపచిగురు తినటం (నింబ కందళ భక్షణం), పంచాంగ శ్రవణం, దైవప్రార్థనం వంటి విశేషాంశాలతో అలంకృతమైన పర్వదినం ఉగాది. మనమే కాదు.. దీనిని తమిళులు ‘పుత్తాండు’గా, మళయాళీలు ‘విషు’గా, మరాఠీలు ‘గుడి పడ్వా’గా, సిక్కులు ‘బైసాఖీ’గా, బెంగాలీలు ‘పోయిలా బైశాఖ్‌’గా వేడుక చేసుకుంటారు. ఈ ఉగాది నాడు మంచిపని చేపడితే సంవత్సరమంతా అది కొనసాగుతుందన్నది అందరి నమ్మకం. ఆ ఒక్కరోజేే కాకుండా సదా అందరితో కలిసిమెలిసి ఉంటూ, నలుగురికీ శ్రేయస్సు కలిగించే పనులు చేస్తుంటే ప్రతిదినమూ ఉగాదే, అనునిత్యం ఉషస్సే.