
కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ, మహిళా మిత్ర విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలానికి చెందిన బొక్కసంపాలెంలు తొలి ర్యాంకుల్లో నిలిచి రూ.కోటి చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నాయి.
పేదరిక నిర్మూలన-మెరుగైన జీవనోపాధుల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన చెముళ్లపల్లి రెండో ర్యాంకు సాధించి రూ.75 లక్షలు, స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల మూడో ర్యాంకులో నిలిచి రూ.25 లక్షల ప్రైజ్‌మనీ సాధించింది. ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 పేరుతో ప్రకటించిన అవార్డుల్లో చిత్తూరు జిల్లా కుప్పం మూడో ర్యాంకు సాధించి రూ.1.50 కోట్ల నగదు బహుమతి చేజిక్కించుకొంది.
మొత్తంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద దేశవ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలకు ర్యాంకులు ప్రకటించి రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ కింద 8 పంచాయతీలను ఎంపిక చేసి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నగదు బహుమతులు ప్రకటించారు. మొత్తం ఆరు అవార్డులు సాధించి కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, ఐదు అవార్డులు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు రెండోస్థానంలో నిలిచాయి. వచ్చేనెల 3న దిల్లీలో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్తమ పనితీరు కనబరిచే పంచాయతీలను ప్రోత్సహించడానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఏటా ఈ అవార్డులు ప్రకటిస్తుంది.





