News

నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన ఇల్లు కూల్చివేతకు నోటీసులు

9views

మహారాష్ట్రలో నాసిక్‌లోని టీసీఎస్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మాతమార్పిళ్ల కేసు లో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటినుంచి 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ ఇంటిని కూల్చివేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఔరంగాబాద్‌లోని ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పటేల్‌ నిందితురాలికి ఆశ్రమిచ్చినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

కార్పొరేటర్‌ తన ఇంటిని, కార్యాలయాన్ని గతంలో అక్రమంగా నిర్మించినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై స్పష్టతనివ్వాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపామన్నారు. వాటికి సంతృప్తికర సమాధానం రాకపోతే ఆ రెండింటినీ కూల్చివేస్తామని మేయర్‌ సమీర్‌ రాజూర్‌కార్‌ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రుజువైతే మతిన్‌ పటేల్‌ తన కార్పొరేటర్‌ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిదాఖాన్‌కు ఆశ్రయమివ్వాల్సిందిగా ఏఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్.. మతిన్ పటేల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఆరోపించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా సిట్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాశారు. దీంతో పోలీసులకు నిదాఖాన్‌ ఆచూకీ లభ్యమయ్యింది. గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీనగర్‌లోని కార్పొరేటర్‌ నివాసంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.