News

ప్రాచీన వైద్య సేవ‌ల్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు కృషి

7views

ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్య‌త‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్య‌రోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి(ఆయుష్‌) వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్‌ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్‌ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2022కు సవరణ చేశామ‌న్నారు. చట్టసభల ద్వారా ఈ బిల్లుకు లభించిన ఆమోదానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో త్వరలో కొత్త విధివిధానాలు రాబోతున్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. ఈ క్రమంలో విధివిధానాల రూపకల్పనకు మూడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామ‌న్నారు. టెక్నిక‌ల్ క‌మిటీ, ఎక్స్‌పెర్ట్స్ క‌మిటీ, స్టేక్ హోల్డ‌ర్స్ పేర్ల‌తో ఏర్పాటైన క‌మిటీల్లో ముగ్గురు చొప్పున అధికారులు, సీనియ‌ర్ వైద్యులు, నిపుణులున్నారన్నారు. ఈ క‌మిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్ర‌జ‌ల్ని భాగ‌స్వామ్యం చేసి వారి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. విధివిధానాల ఖ‌రారు ద్వారా రాష్ట్రంలో ప్రసుత్తం అల్లోపతి వైద్యాన్ని అందించే ఆసుపత్రులపై నియంత్రణ ఉన్న మాదిరిగానే ఆయుష్ ఆసుపత్రులపై కూడా ఆయుష్ శాఖకు అధికారాలు సంక్రమిస్తాయి.

  ప్రభుత్వం చొరవతో ఆయుష్ వైద్యానికి మహర్దశ

ఆయుష్ పరిధిలోనికి వచ్చే ఆయుర్వేద, హోమియో, యూనాని, యోగా అండ్ నేచురోపతి కింద వైద్యాన్ని అందించే సంస్థలపై ప్రస్తుతం ప్రభుత్వపరంగా ఎటువంటి నియంత్రణ లేదు. అర్హతలు కలిగిన వారు మాత్రమే కాకుండా లేనివారు సైతం క్లినిక్ లు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో ఆయుష్ రంగానికి సంబంధించి ఆసుపత్రులు ఉన్నా.. వీటి ద్వారా రోగులు వైద్య సేవలు పొందుతున్నా అధికారికంగా చెప్పేందుకు వీల్లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అచేతనావస్థలో ఉన్న ఆయుష్ వైద్యానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోస్తోంది. కేంద్ర ప్రభుత్వ చేయూతతో ఆయుష్ వైద్యానికి మహర్దశను తీసుకువస్తోంది. కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు, ఆయుష్ వైద్య కళాశాలలు ప్రభుత్వరంగంలో రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అల్లోపతి మాదిరిగానే ఆయుష్ వైద్య రంగాన్ని సైతం ప్రభుత్వపరంగా పటిష్ఠం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న‌ చర్యల్లో భాగంగా ప్రైవేట్‌ మెడికిల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టానికి సవరణ జరిగింది. దీనికనుగుణంగా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ జారే చేసిన‌ ఆదేశాల మేర‌కు ఆయుష్ ఇంఛార్జి డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ క‌మిటీల ఏర్పాటు, ఇత‌ర చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఈ విధివిధానాల రూప‌కల్ప‌న‌లో భాగంగా కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో అమ‌లులోఉన్న బెస్ట్ ప్రాక్సీసెస్‌ను కూడా క‌మిటీలు ప‌రిశీలిస్తాయి. టెక్నిక‌ల్ క‌మిటీ ముఖ్యంగా ఆయుష్ ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్‌ను, ఎక్స్‌పెర్ట్ క‌మిటీ రెగ్యులేట‌రీ విధానంపై, స్టేక్ హోల్డ‌ర్స్ క‌మిటీ ప్ర‌జ‌ల అభిప్రాయాల్ని తెలుసుకుంటాయి. వీట‌న్నింటినీ క్రోడీక‌రించి చివ‌ర‌గా విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వానికి నివేదిక‌ను అంద‌జేస్తాయి.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

* కొత్తగా రాబోయే నిబంధనలు అనుసరించి క్లినిక్‌లు, ఆసుపత్రులు ఆయుష్ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పొందడం వల్ల నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించి క్లినిక్‌లు, ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకొస్తాయి.
*విద్యార్హతలు కలిగిన వారి ద్వారా మాత్రమే ప్రజలకు ఆయు ష్ వైద్య సేవలు అందుతాయి. ప్రస్తుతం ఉన్న నకిలీల బెడద క్రమంగా తగ్గిపోతుంది. అందుబాటులో ఉన్న ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ప్రస్తుతం రాష్ట్రంలో 2,558 ఆయుర్వేదలో (యూజీ/పీజీ), హోమియోపతిలో (యూజీ/పీజీ)లో 4,599, యూనానిలో 788, నేచురోపతి అండ్ యోగాలో 379 మంది అర్హత కలిగిన వైద్యులు రిజిస్ట్రేషన్ పొందారు. చట్టసవరణ ద్వారా వీరికి మరింత గుర్తింపు పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతుంది.