
‘అక్కా మనం రోజూ ఇలా చెట్లు నరుకుతూ పోతే కొన్నాళ్లకు అడవే ఖాళీ అవుతుంది. ఇక మన పిల్లలు ఎలా బతుకుతారు?’… ఈ ఒక్క ప్రశ్న కొన్ని హెక్టార్ల అడవిని కాపాడిందంటే నమ్ముతారా? అది అడిగింది… జమున టుడూ. ఈమెది ఒడిశాలోని రాయిరంగపుర్. పచ్చదనం, పొలాల మధ్య పెరిగారీమె. పెళ్లయ్యాక ఝార్ఖండ్‌లోని మాతుకంకి వచ్చారు. ఇంటి చుట్టూ చెట్లేనని ఆనందించేలోపే సగానికి నరికినవే ఎక్కువగా కనిపించాయామెకి. వంటచెరకు కోసమని స్థానికులు, తమ స్వార్థం కోసం స్మగ్లర్లు నరికేసినవే అవన్నీ. పచ్చని అడవి మోడుబారడం చూడలేకపోయారామె. దాన్ని కాపాడాలనుకున్నారు. చెట్లను నరికితే మనకే ప్రమాదమంటూ అవగాహన కల్పించడం మొదలుపెట్టారు.
కానీ ఇంట్లోవాళ్లు సహా ఎవరూ తోడు రాలేదు. అయినా ఆమె ప్రయత్నం ఆపలేదు. చివరికి అయిదుగురు మహిళలు ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుని చేయి కలిపారు. అలా ‘వన సురక్ష సమితి’ మొదలైంది. బాణాలు, కర్రలు, కత్తులు చేతపట్టి అడవికి కాపలాగా వెళ్లేవారు. నక్సల్స్, మాఫియా వాళ్లను అడ్డుకున్నారు. వాళ్లని ముందుండి నడిపిన జమునకు అప్పటికి 18 ఏళ్లే. ఈక్రమంలో బెదిరింపులు, చావు వరకూ వెళ్లొచ్చిన సందర్భాలూ బోలెడు. అయినా ఆమె పోరాటం ఆపలేదు. కాబట్టే, వాళ్ల ఊరి అడవి బతికింది. ఆపై తన పోరాటాన్ని పక్క ఊళ్లకీ విస్తరించారు జమున.
ఆమెను అనుసరిస్తున్న ఆ మహిళా సైన్యం సంఖ్య ఎంతో తెలుసా? పదివేలమంది. ఎన్నో మొక్కల్నీ నాటించిన ఆమె 50 హెక్టార్ల అడవిని కాపాడారు. ఆమె ధైర్యానికి పద్మశ్రీసహా దేశవిదేశీ అవార్డులూ వరించాయి. ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’ కితాబూ జమున ధైర్యానికి ఓ చిహ్నమే!




