
బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే సమావేశాలు జరిగే సభా మండపంలో వున్న భారత మాత చిత్రపటానికి నివాళులు అర్పించారు. దీని తర్వాత మోహన్ భాగవత్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రతినిధులందరూ ‘‘సంఘటనా మంత్రం’’ జపించారు. ఈ నెల 21,22,23 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.ఈ సమావేశాల్లో గత సంవత్సర వార్షిక నివేదిక (కార్యవృత్త) సమర్పించారు. దీనికి సంబంధించి ఈ బైఠక్ లో చర్చిస్తారు.
దీని కంటే ముందు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ సీఆర్ ముకుంద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 1,482 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. వారి వారి ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలపై నివేదికలను సమర్పిస్తారన్నారు. వాటిపై విశ్లేషణ కూడా వుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా సీఆర్ ముకుంద దేశంలోని శాఖా వివరాలను వెల్లడించారు. మొత్తం 51,570 స్థలాల్లో దైనందిన శాఖలు 83,129 నడుస్తున్నాయని, మరోవైపు శాఖా మిలన్లు (వీక్లీ) 32,147 నడుస్తున్నాయన్నారు. వీటితో పాటు నెలవారీ శాఖలు (మండలి) 12,091 నడుస్తున్నాయని వెల్లడించారు. దైనందిన శాఖ+ మిలన్లు+ మండలితో కలిపితే మొత్తం 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇక గ్రామీణ ప్రాంతాలకు కూడా సంఘ్ విస్తరించిందన్నారు. మొత్తం 58,981 గ్రామీణ మండలాలు వుంటే… వీటిలో 30,770 దైనందిన శాఖలు నడుస్తున్నాయని, గత యేడాదితో పోలిస్తే 3,050 పెరుగుదల కనిపిస్తోందని ముకుంద అన్నారు.
ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంఘ విస్తరణ కోసం 2,453 మంది రెండేళ్ల కోసం విస్తారకులుగా వచ్చారన్నారు. ఈ యేడాదితో సంఘ్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంటోందని, ఈ సమయం విస్తరణ, ఏకీకరణ సమయమని అభివర్ణించారు.
గత యేడాది మొత్తం 4,415 ప్రారంభిక్ వర్గలు జరిగాయని, వీటి ద్వారా 2,22,962 మంది కొత్త స్వయంసేవకులుగా అయ్యారని తెలిపారు. వీరిలో 1,63,000 మంది 25 నుంచి 40 ఏళ్ల మధ్య వున్నవారని, 20,000 మంది 40 ఏళ్లకు పైబడిన వారని వెల్లడించారు. ఇది కాకుండా 2012 లో ప్రారంభమైన ‘Join RSS’ వెబ్ సైట్ ద్వారా 12,73,453 మంది సంఘ్ ని సంప్రదించారని పేర్కొన్నారు. వీరిలో 46 వేల మందికి పైగా మహిళలు కూడా వున్నారన్నారు.
సరసంఘచాలక్ మోహన్ భాగవత్ దేశంలో పర్యటించిన వివరాలు, సంఘ కార్యకలాపాలు, కీలక సంఘటనలు, సంఘ్ విస్తరణకి సంబంధించిన వార్షిక నివేదికను సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే సమర్పించారన్నారు.
సేవా విభాగ్ గురించి ముకుంద మాట్లాడుతూ 89,706 సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని, ఇందులో 40,920 విద్యకి సంబంధించిన కార్యక్రమాలు కాగా, 17,461 వైద్య సహాయక కార్యక్రమాలు వున్నాయన్నారు.
వీటితో పాటు సేవ, స్వయం సహాయక కార్యక్రమాలు 10,779, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు 20,546 వున్నాయన్నారు.వీటితో పాటు గోసంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు సామాజిక సమరసతపై కూడా స్వయంసేవకులు శ్రద్ధ వహిస్తున్నారన్నారు. తాగునీరు, ఆలయ ప్రవేశానికి సంబంధించిన సమస్యలతో పాటు సామాజిక దురాచారాలను తొలగించడానికి 1,084 ప్రాంతాల్లో పని నడుస్తోందని తెలిపారు.
ఇక ప్రయాగ రాజ్ వేదికగా జరిగిన మహా కుంభను యూపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని ముకుంద మెచ్చుకున్నారు.ఇ క మణిపూర్ లో గత 20 నెలలుగా రెండు వర్గాల మధ్య హింస తలెత్తడంతో పరిస్థితి ఇబ్బందిగా వుందన్నారు. ఇటీవలి పరిణామాలు కాస్త ఆశాజనంగా వున్నా.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సమయం పడుతుందన్నారు. ఇరు వర్గాల మధ్య చర్చల కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
నార్త్, సౌత్ విభజన అనేది రాజకీయంగా ప్రేరేపించబడుతోందనే తాము నమ్ముతున్నామని ముకుంద తేల్చి చెప్పారు. భాషపై విభేదాలనేవి జాతీయ ఐక్యతకు దెబ్బతీస్తాయని, కాబట్టి సామాజిక నాయకులే వాటిని పరిష్కరించాలన్నారు.