
కర్నాటకలోని రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్ ఇచ్చింది. జిల్లా పేరు మార్చే ప్రస్తావనను తిరస్కరించింది. డీసీఎం డీకే శివకుమార్ పెట్టుకున్న ఆశలకు చుక్కెదురైంది. రామనగరను బెంగళూరు దక్షిణ జిల్లాగా మార్పు చేయాలని డీసీఎం భావించారు. కేబినెట్‌లో తీర్మానించి కేంద్రప్రభుత్వానికి ప్రస్తావనలు పంపారు. రామనగరను పేరు మార్చడాన్ని కేంద్రమంత్రి కుమారస్వామి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర హోం మంత్రిత్వశాఖకు రెండు నెలలక్రితం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఏ ప్రాతిపదకన తిరస్కరించారనేది కేంద్రం స్పష్టం చేయలేదు. కానీ జిల్లా పేరు మార్పును స్థానికులు వ్యతిరేకిస్తున్నారని ఓ కారణం చూపింది. గత ఏడాది రామనగర జిల్లా చన్నపట్టణ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను డీసీఎం డీకే శివకుమార్ ప్రతిష్టాత్మకంగా భావించారు.
ఇదే జిల్లా కనకపుర ఆయన సొంత నియోజకవర్గం కావడంతో తరచూ పర్యటనలో భూములు అమ్ముకోరాదని, భవిష్యత్తు ఉందని పలుమార్లు సూచించారు. చన్నపట్టణ ఎన్నికల వేళ జిల్లా పేరు మార్పు జరుగుతుందని, బెంగళూరుకు అనుబంధం కానుందని ప్రచారం చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రప్రభుత్వం జిల్లా పేరు మార్పునకు ససేమిరా అనడంతో ఆయన ఆశలు ఫలించలేదు.