News

బక్రీద్ సందర్భంగా మలేగావ్‌లో 906 గోవుల రక్షణ – 257 మంది స్మగ్లింగ్ నిందితులపై కేసులు

6views

మహారాష్ట్రలోని నాసిక్ లో బక్రీద్ సందర్భంగా అక్రమ గోవధను అడ్డుకునేందుకు మలేగావ్ పోలీసులు చేపట్టిన విస్తృత చర్యల్లో విశేష విజయాన్ని సాధించారు. రాష్ట్రంలోని గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన గోవంశాలను గుర్తించి రక్షించారు. ఈ చర్యల ఫలితంగా మొత్తం 906 గోవంశాల ప్రాణాలు కాపాడబడ్డాయి

పోలీసులు ఇళ్లు, పవర్‌లూమ్ కర్మాగారాలు, ఇరుకైన సందులు, దట్టమైన పొదలు వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమంగా వధ కోసం సిద్ధం చేసిన పశువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖరీదైన వాహనాల్లో అత్యంత క్రూరంగా కుక్కి తరలిస్తున్న పశు స్మగ్లింగ్ ముఠాలను గుర్తించి వారి కార్యకలాపాలను భగ్నం చేశారు.

మలేగావ్ డివిజన్ పరిధిలో మొత్తం 155 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించిన పోలీసులు, సవరించిన గోవధ నిషేధ చట్టం కింద 257 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ‘కౌ స్క్వాడ్’ (గో రక్షణ దళం)ను ఏర్పాటు చేసి, ప్రాంతమంతటా తనిఖీ కేంద్రాలను మోహరించారు.

ఈ ఆపరేషన్లలో పోలీసులు 110 వాహనాలను స్వాధీనం చేసుకొని, అక్రమ గోవధ మరియు పశు స్మగ్లింగ్ కార్యకలాపాలపై గట్టి దెబ్బ కొట్టారు. గోరక్షణకు సంబంధించిన చట్టాల అమలులో మలేగావ్ పోలీసుల చర్యలు ఆదర్శప్రాయంగా నిలిచాయని స్థానిక హిందూ సంఘాలు అభినందించాయి.

గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే అక్రమ గోవధ మరియు పశు స్మగ్లింగ్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.