శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది. దాదాపు మూడు జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి పశువులు క్రయవిక్రయాలు చేస్తుంటారు. గతంలో పశువులను నడిపించుకొని రైతులు సంతకు తెచ్చేవారు. కానీ ఇప్పడు వాహనాల్లో తెస్తున్నారు. అందులో రైతులు ఎవరు? కబేళాలకు తరలించే వ్యాపారులు ఎవరో తెలియని పరిస్థితి..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలోని చింతాడ వద్ద ప్రతీ శనివారం సంత జరుగుతుంది. అక్కడ ప్రతీవారం రూ.లక్షల్లో పశువుల వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి రైతుల కంటే వ్యాపారులు వచ్చి పశువులు కొనుగోలు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈ సంత నుంచి కబేళాలకు పశువులు తరలిస్తున్నారన్న అనుమానాలున్నాయి.
జిల్లాలోని కోటబొమ్మాళి మండలం నారాయణవలస- తిలారు సంత ప్రతీ గురువారం జరుగుతుంటుంది. ఇక్కడ సైతం భారీ స్థాయిలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి కూడా పశువులను కబేళాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ కొనుగోలు చేసిన పశువులను వ్యాన్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ నుంచి కంటైనర్లలో రాత్రిపూట రవాణా చేస్తారని తెలుస్తోంది.
ఇలా.. జిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దళారుల ద్వారా సంతల్లో కొనుగోలు చేసిన పశువులను వ్యాన్‌లు, కంటైనర్లలో కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పశువుల కొనుగోలుకు కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారుల విషయం బయటపడకుండా వారు రైతుల రూపంలో గ్రామాల్లోకి వస్తారు. పశువులను కొనుగోలు చేస్తారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చుతారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరు కంటైనర్లతో రహస్యంగా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో రైతులకు పశువుల వినియోగం తగ్గింది. పాడి పశువుల పెంపకం మాత్రం పెరుగుతోంది. కాగా వయసు అయిపోయిన పశువులను తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. అటువంటి పశువులనే సంతల్లో దళారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కానరాని నిబంధనలు
పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. కానీ ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. రవాణా విషయంలో కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహరం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గమధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు, పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంతలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
తనిఖీలు ముమ్మరం
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పశువుల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టిపెట్టాం. అక్రమంగా పశువులు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని పశువులను గోశాలలకు తరలిస్తున్నాం. జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశాం. పశువులు తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అన్నిరకాల అనుమతులు, వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తున్నారని తేలాక విడిచిపెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై సైతం దృష్టి పెట్టాం.– ఎం.అవతారం, సీఐ, జేఆర్ పురం





